రెండో టెస్టుపై పట్టు బిగించిన టీమ్ ఇండియా.. 171 పరుగుల ఆధిక్యం

by Dishanational3 |
రెండో టెస్టుపై పట్టు బిగించిన టీమ్ ఇండియా.. 171 పరుగుల ఆధిక్యం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఆధిపత్య స్థితిలో నిలిచింది. యువ సంచలనం యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతోపాటు స్టార్ పేసర్ బుమ్రా బంతితో చెలరేగడంతో మ్యాచ్‌‌పై భారత్ పట్టు బిగించింది. విశాఖపట్నం‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 336/6తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(209, 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ బాదాడు. అతను ద్విశతకంతో రాణించడంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌కు భారీ స్కోరు దక్కింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్(3/47), రెహాన్ అహ్మద్(3/65), షోయబ్ బషీర్(3/138) సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలీ(76) హాఫ్ సెంచరీ చేయగా.. సోక్ట్స్(47) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఇంగ్లాండ్ పతనంలో బుమ్రా(6/45) కీలక పాత్ర పోషించాడు. అతనికితోడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(3/71) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియాకు 143 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(15 బ్యాటింగ్), రోహిత్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఉన్నది.

బుమ్రా పేస్ ముందు ఇంగ్లాండ్ విలవిల

రెండో రోజు తొలి సెషన్‌లోనే మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ అదే రోజు కుప్పకూలింది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అయితే, ఇంగ్లాండ్ వికెట్ల పతనాన్ని ఆరంభించింది మాత్రం స్పిన్నర్ కుల్దీప్. కుల్దీప్ బౌలింగ్‌లో ఓపెనర్ డక్కెట్(21) క్యాచ్ అవుటవడంతో 59 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓలీ పోప్‌తో కలిసి జాక్ క్రాలీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు చూశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్ క్రాలీ(76)ని అక్షర్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు జాక్ క్రాలీ నిరాశగా మైదానం వీడాడు. కాసేపటికే బుమ్రా విజృంభించాడు. రూట్(5), ఓలీ పోప్(23), బెయిర్ స్టో(25)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు. దీంతో 159 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత బుమ్రా జోరుకు కుల్దీప్ తోడవడంతో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం దక్కలేదు. ఫోక్స్(6), రెహాన్ అహ్మద్(6).. కుల్దీప్ మాయలో చిక్కుకుని మైదానం వీడారు. మరోఎండ్‌లో వికెట్లు పడుతున్నా కెప్టెన్ బెన్‌స్టోక్స్(47) జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. టామ్ హార్ట్లీ(21)తో కలిసి జట్టును నడిపించాడు. అయితే, వరుస ఓవర్లలో వీరిని అవుట్ చేసిన బుమ్రా.. చివరి వికెట్‌గా అండర్సన్(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఇంగ్లాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ 3 వికెట్లతో రాణించాడు. అక్షర్‌కు ఒక్క వికెట్ దక్కింది.

జైశ్వాల్ డబుల్ సెంచరీ

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ మరో 60 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిందంటే కారణం ఓపెనర్ యశస్వి జైశ్వాల్. తొలిరోజు అసాధారణ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు అండగా నిలిచిన అతను రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి తొలి ద్విశతకం సాధించాడు. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ మార్క్‌లను జైశ్వాల్ బౌండరీలతోనే అందుకోవడం విశేషం. కాసేపటికే అండర్సన్ బౌలింగ్‌లో జైశ్వాల్(209) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుటయ్యాడు. అంతకుముందు అండర్సన్ బౌలింగ్‌లోనే మరో ఓవర్‌నైట్ బ్యాటర్ అశ్విన్(20) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ వరుస ఓవర్లలో బుమ్రా(6), ముకేశ్(0)లను అవుట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కుల్దీప్(8 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బసీర్, రెహాన్ అహ్మద్ మూడేసి వికెట్లతో రాణించగా.. టామ్ హార్ట్లీకి ఒక వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 396 ఆలౌట్(112 ఓవర్లు)

జైశ్వాల్(బి)బెయిర్‌స్టో(బి)అండర్సన్ 209, రోహిత్(సి)ఓలీపోప్(బి)బషీర్ 14, గిల్(సి)ఫోక్స్(బి)అండర్సన్ 34, శ్రేయస్ అయ్యర్(సి)ఫోక్స్(బి)టామ్ హార్ట్లీ 27, రజత్ పాటిదార్(బి)రెహాన్ అహ్మద్ 32, అక్షర్(సి)రెహాన్ అహ్మద్(బి)బషీర్ 27, భరత్(సి)బషీర్(బి)రెహాన్ అహ్మద్ 17, అశ్విన్(సి)ఫోక్స్(బి)అండర్సన్ 20, కుల్దీప్ 8నాటౌట్, బుమ్రా(సి)రూట్(బి)రెహాన్ అహ్మద్ 6, ముకేశ్(సి)రూట్(బి)బషీర్ 0; ఎక్స్‌ట్రాలు 2.

వికెట్ల పతనం : 40-1, 89-2, 179-3, 249-4, 301-5, 330-6, 364-7, 383-8, 395-9, 396-10

బౌలింగ్ : అండర్సన్(25-4-47-3), రూట్(14-0-71-0), టామ్ హార్ట్లీ(18-2-74-1), బషీర్(38-1-138-3), రెహాన్ అహ్మద్(17-2-65-3)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 253 ఆలౌట్(55.5 ఓవర్లు)

జాక్ క్రాలీ(సి)అయ్యర్(బి)అక్షర్ 76, డక్కెట్(సి)రజత్ పాటిదార్(బి)కుల్దీప్ 21, ఓలీ పోప్(బి)బుమ్రా 23, రూట్(సి)గిల్(బి)బుమ్రా 5, బెయిర్‌స్టో(సి)గిల్(బి)బుమ్రా 25, స్టోక్స్(బి)బుమ్రా 47, ఫోక్స్(బి)కుల్దీప్ 6, రెహాన్ అహ్మద్(సి)గిల్(బి)కుల్దీప్ 6, టామ్ హార్ట్లీ(సి)గిల్(బి)బుమ్రా 21, అండర్సన్ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 6, బషీర్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 59-1, 114-2, 123-3, 136-4, 159-5, 172-6, 182-7, 229-8, 234-9, 253-10

బౌలింగ్ : బుమ్రా(15.5-5-45-6), ముకేశ్(7-1-44-0), కుల్దీప్(17-1-71-3), అశ్విన్(12-0-61-0), అక్షర్(4-0-24-1)

భారత్ రెండో ఇన్నింగ్స్ : 28/0(5 ఓవర్లు)

జైశ్వాల్ 15 బ్యాటింగ్, రోహిత్ 13 బ్యాటింగ్

బౌలింగ్ : అండర్సన్(2-0-6-0), షోయబ్ బషీర్(2-0-17-0), రెహాన్ అహ్మద్(1-0-5-0)



Next Story

Most Viewed