ఏపీ క్రికెట్‌లో రాజకీయాలు.. అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను: హనుమ విహారీ సంచలన ఆరోపణలు

by Dishanational5 |
ఏపీ క్రికెట్‌లో రాజకీయాలు.. అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను: హనుమ విహారీ సంచలన ఆరోపణలు
X

దిశ, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా బ్యాటర్ హనుమ విహారీ సంచలన ఆరోపణలు చేశాడు. ఏపీ క్రికెట్‌లో క్రీడాకారుల కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువుందని, స్థానిక రాజకీయ నేత జోక్యం ఎక్కువైందని వెల్లడించాడు. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడటం తన వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ‘ఎక్స్’(ట్విట్టర్) ఖాతాలో సోమవారం సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ‘‘2023-24 రంజీ సీజన్లో మొదటి మ్యాచ్ బెంగాల్‌తో గెలిచిన తర్వాత నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ కోరింది. ఆటలో భాగంగా జట్టులో 17వ ఆటగాడిపై అరిచినందునే రిజైన్ చేయాలని చెప్పింది. ఆ 17వ సభ్యుడు ఓ రాజకీయ నాయకుడి కుమారుడు. ఆ రాజకీయ నేత ఒత్తిడితోనే అసోసియేషన్ నన్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ఆంధ్ర క్రికెట్ జట్టు కోసం ఎంతో కృషి చేశాను. అలాంటి నాకు అసోసియేషన్ చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకున్న ఆంధ్ర జట్టులో ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఆంధ్ర జట్టును, క్రికెట్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను. ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానాన్ని నేను ఇష్టపడినా.. అసోసియేషన్ మాత్రం మనం ఎదగాలని కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.




Next Story

Most Viewed