క్వార్టర్స్‌లో సింధు పోరాటం ముగిసె

by Dishanational3 |
క్వార్టర్స్‌లో సింధు పోరాటం ముగిసె
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు జోరుకు బ్రేక్ పడింది. క్వార్టర్స్‌లో ఆమె పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 24-22, 17-21, 18-21 తేడాతో చైనా షట్లర్ చెన్ యుఫీ చేతిలో పోరాడి ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సింధుదే శుభారంభం. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను సింధు గెలుచుకుంది. అయితే, మిగతా రెండు గేమ్‌ల్లోనూ పోరాడినప్పటికీ ప్రత్యర్థిని నిలువరించలేక మ్యాచ్‌ను కోల్పోయింది.

మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 19-21, 21-15, 21-13 తేడాతో సింగపూర్ ఆటగాడు లోహ్ కీ యూను ఓడించాడు. గంటా 18 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు, మూడు గేమ్‌లను గెలుచుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సింధు, శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ వెనుదిరగడంతో టోర్నీలో మిగిలిన ఏకైక సింగిల్ ప్లేయర్ లక్ష్యసేన్ మాత్రమే. భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ 21-19, 21-13 తేడాతో థాయిలాండ్‌కు చెందిన సుపక్ జోమ్కో-కిట్టినుపోంగ్ కెడ్రెన్‌ జోడీపై విజయం సాధించింది. సాత్విక్ జంట 42 నిమిషాల్లోనే వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి ప్రత్యర్థుల ఆట ముగించింది.


Next Story

Most Viewed