బీసీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిందే! తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరిక

by Disha Web Desk 14 |
బీసీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిందే!  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ)కు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ)తో కలిసి పనిచేయాలని, తెలంగాణ జిల్లాల క్రీడాకారులకు సరైన అవకాశాలు ఇవ్వాలని బీసీసీ గతంలో ఆదేశించినట్లు టీసీఏ తెలిపింది. కానీ రెండున్నర ఏళ్ళ క్రితం బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్‌సీఏ కోర్టు ధిక్కరణ చేస్తున్నదని టీసీఏ ఆరోపించింది. ఈ క్రమంలోనే టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఇవాళ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ బీసీసీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి విషయంలో టీసీఏతో సంప్రదిస్తారా? లేక గత 80 ఏండ్లుగా అన్యాయం చేస్తున్నట్లు జిల్లాలకు మాయ మాటలు, కట్టు కథలు చెప్పుకుంటూ అన్యాయం చేస్తారా? అని హెసీఏను డిమాండ్ చేశారు.

తెలంగాణలో 5 లక్షల మంది క్రికెట్‌ ఆడుతున్న యువత

ఇండియన్ టీమ్ రిప్రజెంటేషన్ కోసం రాజ్యాంగ బద్దంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామనే ఒప్పందం ఉల్లంఘిస్తారా? లేక తెలంగాణ జిల్లాలకు న్యాయం చేస్తారా? అని బీసీసీఐని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల మంది యువత క్రికెట్‌ను ఆడుతున్నారని, వాళ్లందరూ ఏదో ఒక రోజు తాము ఒక సచిన్, ధోనీ, కోహ్లీ అవుతామని కలలు కంటూ క్రికెట్ ఆడుతున్నారని తెలిపారు. ఈ 5 లక్షల మంది యువత వాళ్ల ద్వారా ప్రభావితం అయ్యే దాదాపు 30 లక్షల మంది ఓటర్లతో తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎంపీ అభ్యర్థులకు పని లేదనుకుంటే మా తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కాబట్టి టీసీఏకు బీసీసీఐ గుర్తింపు విషయంలో రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. ఒక వేళ అతి త్వరలో దీనిపైన హెచ్‌సీఏ కానీ, బీసీసీఐ కానీ లేదా సంబంధిత అధికారుల నుండి కానీ సానుకూల స్పందన రాకపోతే వచ్చే ఎలక్షన్లలో మా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed