పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసిస్

by Dishanational5 |
పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసిస్
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న కంగారుల జట్టు.. మూడో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న పాక్‌కు భంగపాటు తప్పలేదు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో శనివారం 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన పాక్ మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది.మూడో రోజే కీలక వికెట్లు కోల్పోయింది. పేసర్ హాజెల్‌వుడ్ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 68/7తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ మరో 47 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. రిజ్వాన్(28), అమీర్ జమాల్(18), హసన్ అలీ(5).. ఈ ముగ్గురు లియోన్ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. ఆసిస్ బౌలర్లలో హాజెల్‌వుడ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. లియోన్ 3 వికెట్లుతో రాణించాడు. స్టార్క్, కమిన్స్, హెడ్‌కు చెరో వికెట్ దక్కింది. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 14 పరుగులు కలుపుకుని ఆసిస్ ముందు 130 టార్గెట్ పెట్టింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) నిరాశపర్చినా.. చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(57), లబుషేన్(62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరవడంతో ఆసిస్ విజయం తేలికైంది. ఆఖర్లో వార్నర్ అవుటైనా.. స్టీవ్ స్మిత్(4 నాటౌట్)తో కలిసి లబుషేన్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Read More..

అఫ్గాన్ జట్టులోకి అతను తిరిగొచ్చాడు.. కానీ, భారత్‌పై ఆడటం డౌటే..

Next Story

Most Viewed