భారత్‌కు చావోరేవో.. రేపే ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20

by Dishanational5 |
భారత్‌కు చావోరేవో.. రేపే ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ నెగ్గి సిరీస్ ఆశలు రేపిన హర్మన్‌ప్రీత్ సేన రెండో టీ20లో బోల్తాపడింది. ప్రత్యర్థి పుంజుకోవడం, భారత జట్టు బ్యాటుతో విఫలమవడంతో ఓటమి తప్పలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇక, సిరీస్ ఫలితం తేల్చే నిర్ణయాత్మక మూడో టీ20 మంగళవారమే జరగనుంది. నవీ ముంబై వేదికగానే జరిగే ఈ మ్యాచ్‌లో ఆసిస్‌తో టీమ్ ఇండియా తాడోపేడే తేల్చుకోనుంది. ఇప్పటివరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్ విజయం సాధించలేదు. మరి, ఈ నిరీక్షణకు భారత జట్టు తెరదించుతుందా?..వేచి చూడాల్సిందే.

సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై ఏకైక టెస్టు విజయంతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆసిస్‌పై కలగానే ఉన్న టెస్టు విజయాన్ని అందుకుంది. అయితే, వన్డే సిరీస్ ఓటమి భారత జట్టును తీవ్ర నిరాశకు గురి చేసింది. వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. మూడో టీ20లో భారత జట్టు అంచనాలకు మించి రాణించాల్సి ఉంది. బలమైన ఆసిస్‌ను పడగొట్టాలంటే ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిందే. బౌలింగ్ దళం కాస్త మెరుగ్గానే ఉన్నా.. బ్యాటింగ్ దళంలో నిలకడలేమి భారత జట్టు వైఫల్యానికి కారణమవుతుంది. జట్టులో స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ కాస్త కూస్తో పరుగులు రాబడుతున్నా వారి స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. పేలవ ఫామ్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు భారంగా మారింది. రిచా ఘోష్, షెఫాలీ వర్మ ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుటవుతున్నారు. ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ సత్తాచాటుతున్నా.. పూజ వస్త్రాకర్, అమన్‌జ్యోత్ కౌర్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. మొత్తంగా జట్టు బ్యాటింగ్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నేటి మ్యాచ్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభం అందించడం కీలకం కానుంది. జట్టుకు ఆరంభం దక్కితే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలు ఉంటుంది. ఓపెనర్లు విఫలమైతే రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ జట్టు భారాన్ని మోయాల్సి ఉంటుంది. మొత్తంగా నేటి మ్యాచ్‌లో సమిష్టిగా రాణించడంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. బౌలింగ్‌పరంగా దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ టచ్‌లో ఉండగా.. రేణుక సింగ్, టిటాస్ సాధు నుంచి నుంచి సహకారం అందాల్సి ఉంది.

బలంగా ప్రత్యర్థి

ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా కనిపిస్తున్నది. హీలీ, బెత్ మూనీ, మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, లిచ్‌ఫీల్డ్ టచ్‌లో ఉండటం ఆసిస్‌‌కు బలం కానుంది. వీరిలో ఏ ఇద్దరైనా క్రీజులో పాతుకపోతే భారీ స్కోరు ఖాయమే. రెండో టీ20లో ఆసిస్ ముందు మోస్తరు లక్ష్యమే పెట్టినా ఒకదశలో భారత్‌ను బౌలర్లు పోటీలోకి తెచ్చేలా కనిపించారు. కానీ, ఎల్లీస్ పెర్రీ, లిచ్‌ఫీల్డ్ ఆశలపై నీళ్లుచల్లారు. కాబట్టి, నేటి మ్యాచ్‌లో భారత బౌలర్లు భాగస్వామ్యాలను విడదీయడంపై వ్యూహరచన చేయాల్సి ఉంది. అలాగే, బౌలర్లలో వారేహమ్, సదర్లాండ్‌.. భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.

తుది జట్లు(అంచనా)

భారత్ : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోస్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అమన్‌జ్యోత్ కౌర్/సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, రేణుక సింగ్.

ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, గార్డ్‌నెర్, లిచ్‌ఫీల్డ్, గ్రేస్ హారిస్, సదర్లాండ్, వారేహమ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.



Next Story

Most Viewed