‘ధరణి’తప్పులు సరిదిద్దేవారే లేరా?

by  |
‘ధరణి’తప్పులు సరిదిద్దేవారే లేరా?
X

చాలా బాగుందని గొప్పగా చెప్పుకుంటున్న ‘ధరణి’ డేటాలో అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. రైతుల పేర్లు, భూముల విస్తీర్ణాల్లో తేడాలుంటున్నాయి. 55 రోజుల తర్వాత కొత్తగా మొదలు పెట్టిన భూముల రిజిస్ట్రేషన్లలోనూ తప్పులు చేస్తున్నారు. చిత్రవిచిత్రమైన భాషలో పేర్లు, వివరాలు ప్రచురితమవుతున్నాయి. ఇది సిబ్బంది నిర్లక్ష్యమో, ఉద్దేశ్యపూర్వకమో అంతుచిక్కడం లేదు. దీంతో క్రయ, విక్రయదారులు హతాశులవుతున్నారు. వీటిని సరిదిద్దే వ్యవస్థ లేకపోవడం విడ్డూరమని నిపుణులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో :

ఇంతకు ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనేవారి, అమ్మేవారి పేర్లను పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుల ఆధారంగా నమోదు చేసేవారు. సేల్ డీడ్‌లో అక్షర దోషాలు లేకుండా చూసుకునేవారు. ఇప్పుడేమో ‘ధరణి’ పోర్టల్ లో రిజిస్ట్రేషన్, ఆటోమెటిక్ మ్యూటేషన్ చేస్తున్నారు. అవన్నీ తప్పులతడకలుగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పేర్లను, వివరాలను సరిగ్గా నమోదు చేయకుండానే ప్రక్రియ కొనసాగుతోందంటున్నారు. ఎన్నికల ఓటర్ల జాబితా మాదిరిగానే పేర్లు గజిబిజిగా మార్చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో ఖాతా నంబరు 60115 లావాదేవీలో పట్టాదారు పేరును ‘పి వి ఆర్ మణి కంత సాయీ’ అని తండ్రి పేరు ‘నారాయాన’ అని టైప్ చేశారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, భూమి యాజమాన్య హక్కు పత్రంలోనూ అలాగే ప్రింట్ చేసి చేతిలో పెట్టారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో ఖాతా నంబరు 162 ద్వారా జరిగిన లావాదేవీ మరీ విచిత్రంగా ఉంది. గ్రామం పేరు ఇంగ్లిషులో గిజిబిజిగా ఇచ్చారు. పట్టాదారు పేరు ఇజ్జగిరి బాబురావుగా పేర్కొన్నారు. మరో ఖాతా నంబరు 60258లో పేరు అనే కాలమ్ లో ‘ఏఝాఘీరుఈ శృఏఏభా’ గా నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మండలాల్లో తప్పులతడకగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

పరిశీలించని అధికారులు..

కొత్త వ్యవస్థను అమలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని రెవెన్యూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఆఖరికి కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలు కూడా అయోమయానికి గురి చేసేటట్లుగానే ఉన్నాయి. దీంతో కొందరు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తొలిదశలో చేసే రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లలోనూ తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. పేర్లు టైప్ చేయలేని ఉద్యోగులు ఉన్నారని స్పష్టమవుతోంది. టైప్ చేసినప్పుడే స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. అలాగే కంటిన్యూ చేస్తుండడం విడ్డూరంగా ఉంది. కొన్ని లావాదేవీలు కలెక్టర్ల సమక్షంలోనే జరిగాయని సమాచారం. వాళ్లు కూడా ప్రొసీడ్ అయ్యే ముందు పరిశీలన చేసుకోకపోవడం గమనార్హం. ఇలాగే తప్పులతో కొనసాగే లావాదేవీలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న సందేహం కలుగుతోంది. పైగా ఇప్పటి వరకు పొరపాట్లను సరిదిద్దే వ్యవస్థనే ‘ధరణి’ పోర్టల్ లో లేదు. మరి ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్దేశ్యపూర్వక, నిర్లక్ష్యపూరిత తప్పిదాలను కొనుగోలుదార్లు, పట్టాదారులు సరి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ధరణిలోని పొరపాట్లను సరిదిద్దేందుకు సంబంధించిన మార్గదర్శకాలేవీ ప్రభుత్వం రూపొందించ లేదు.

ఇప్పటికే అనేక తప్పులు..

సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్ సైట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను విస్తీర్ణంతో సహా నమోదు చేశారు. ఏయే సర్వే నంబర్లల్లోనైతే రికార్డుల్లో అధికంగా విస్తీర్ణం నమోదు చేశారో (పాస్ పుస్తకాల ద్వారా) వాటి మ్యూటేషన్లు సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతోనే భూ యాజమాన్య హక్కులకు సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్ బుక్కులివ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా నమోదు చేయకపోవడంతో అంతా గందరగోళంలో పడింది. తెలంగాణ మొత్తంగా దాదాపు 60 లక్షల ఎకరాల భూమి అదనంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అదనపు భూమి రికార్డుల్లో ఉంది. కానీ, అసలు భూమి లేదు. ఈ క్రమంలో కొత్తగా సేత్వార్ ను రూపొందించడం తప్ప మరో మార్గమేదీ లేదని ఓ డిప్యూటీ కలెక్టర్ స్పష్టం చేశారు.

సరిదిద్దే అవకాశం లేదు..

పట్టాదారుడి పేరు, విస్తీర్ణంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరిదిద్దే అవకాశమే స్థానిక అధికారులకు లేదు. పేరులో దీర్ఘం, కొమ్ము వంటివి పొరపాట్లు చోటు చేసుకున్నా సవరించేందుకు ఏండ్లు పడుతోంది. ‘ధరణి’ పోర్టల్ లో ఇంగ్లిషు నుంచి తెలుగు అనువాదం సాఫ్ట్ వేర్ ఉంది. కొన్ని పేర్లకు సరైన పదాలు సెట్ చేసేందుకు అరగంట కుస్తీ పట్టినా కావడం లేదని సమాచారం. ఈ క్రమంలో ధరణిలో తెలుగు టైప్ కు అవకాశం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘ధరణి’ పోర్టల్ అబాసుపాలు కాకుండా తప్పుల్లేని వ్యవస్థను రూపొందించాలని జనం కోరుతున్నారు.

డిజిటల్ సంతకమేది?

యజమానులందరూ ఆస్తికి సంబంధించిన పత్రాలను అత్యంత పదిలంగా దాచుకుంటారు. స్టాంపు పేపర్ల మీద అమ్మినోళ్లు, కొన్నోళ్ల సంతకాలు, రిజిస్ట్రార్ సంతకం, స్టాంపులు, స్కానింగ్ వివరాలు వంటివి ఉండేవి. ఆ సంతకాలే పేపర్లకు విలువను సమకూర్చేవి. వివాదం తలెత్తితే నలుగురి ఆ ముందు డాక్యుమెంట్లు ఉంచేవారు. సాక్షి సంతకాలు సహా, అందరినీ విచారించి పరిష్కరించే వీలుండేది. ధరణి రిజిస్ట్రేషన్లకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. సాదా కాగితంపై కొన్నోళ్ల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు మినహా మరేవీ కనిపించడం లేదు. జిరాక్స్ పత్రాల కంటే హీనంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి విలువను వ్యక్తీకరించడం లేదు. కనీసం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సంతకంగానీ, డిజిటల్ సంతకంగానీ ఉండడం లేదు. దీంతో ఆ పేపరు ద్వారా రూ.లక్షల విలువైన ఆస్తి లావాదేవీకి సంబంధించినట్లుగా తోచడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. పట్టాదారు పాస్ పుస్తకం మాత్రం ఇచ్చేసి లేదా పాత పుస్తకంలో ఎంట్రీ చేస్తున్నారు. దీంతో కొనుగోలుదార్లకు సంతృప్తి చెందడం లేదు. అత్యంత ఖరీదైన పత్రాలకు విలువ ఏర్పాడాలంటే దానిపై సంతకాలు ఉండాలి. స్టాంపులు ఉండాల్సిందేనన్న అభిప్రాయం రెవెన్యూ అధికారుల నుంచి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కొందరు రెవెన్యూ అధికారులు తీసుకెళ్తే పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. పాస్ పుస్తకం ఇస్తున్నం.. అదే ఫైనల్ అంటూ దాట వేసినట్లు తెలిసింది.



Next Story

Most Viewed