వారు గీత గీస్తే వైరస్ ‘కకా’వికలమే!

by  |
వారు గీత గీస్తే వైరస్ ‘కకా’వికలమే!
X

దిశ, కరీంనగర్: సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలపై వ్యంగ్య చిత్రాలను గీస్తూ ప్రజలను మేల్కొలిపే కార్టూనిస్టులు.. లాక్‌డౌన్ టైమ్‌లోనూ తమ క్రియేటివిటీతో ఆలోచింపజేస్తున్నారు. కరోనా కల్లోలాన్ని సైతం తమ కుంచెలో బంధించి.. వ్యాధి తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తమ కార్టూన్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వారేసిన కార్టూన్లు సమాజంలోకి చొచ్చుకుపోయేందుకు లాక్‌డౌన్ ప్రతిబంధకంగా మారినా.. వారి ఆలోచనలకు మాత్రం బ్రేక్ వేయలేకపోయింది. దీంతో తమ క్రియేటివిటీకి సాంకేతికతను జోడించి వర్చువల్ ఆన్‌లైన్ డాక్యుమెంటరీ తయారు చేయాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో.. రాష్ట్రంలోని కార్టూనిస్టులు వెలుగులోకి వచ్చేందుకు సరికొత్త వేదిక ఏర్పాటైంది. అంతర్జాతీయంగా ఉన్న షాపింగ్ మాల్స్‌లో వర్చువల్ సిస్టంతో డ్రెస్‌లు విక్రయించే విధానం అమలవుతుండగా.. అదే పద్ధతిలో సాంకేతికతను అందిపుచ్చుకుని తమ కార్టూన్లను సమాజానికి అందించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కరోనా కార్టూన్లు (కకా) పేరిట మొట్టమొదటి వర్చువల్ డాక్యుమెంటరీని తయారు చేశారు. ఇందుకోసం నెల రోజుల పాటు శ్రమించి సక్సెస్ అయ్యారు.

అన్నింటా ఆదానే..

తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘానికి కరోనా చూపించిన దారి అన్ని విషయాల్లోనూ ఆదా చేసే విధంగానే ఉంది. గతంలో వీరు వేసిన కార్టూన్ల ప్రదర్శన కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. ఎగ్జిబిషన్ కోసం ప్రముఖుల అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో వారి సమయాన్ని కూడా వృథా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వర్చువల్ ఆన్‌లైన్ డాక్యుమెంటరీ తయారుచేసే ముందు ప్రముఖులకు సమాచారమివ్వడంతోపాటు తాము తయారు చేసే వీడియో గురించి వివరించి అందుకు అనుగుణంగా అభిప్రాయాలతో వీడియో క్లిప్‌ను పంపాలని కోరుతున్నారు. ప్రముఖులు పంపిన ఒపీనియన్ వీడియోలు, కార్టూన్లతో ఓ డాక్యుమెంటరీగా తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నూతన విధానాన్ని రానున్న కాలంలోనూ యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నారు తెలంగాణ కార్టూనిస్టులు.

దేశంలో మొట్టమొదటి డాక్యుమెంటరీ

తెలంగాణలోని కార్టూనిస్టులు.. దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ ఆన్‌‌లైన్ డాక్యుమెంటరీ తీసి రికార్డు సృష్టించారు. రానున్న కాలంలో ఈ డాక్యుమెంటరీ విధానం దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 300 మంది వరకు ఫ్రీలాన్స్ కార్టూనిస్టులుంటే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 38 మంది కార్టూనిస్టులుండటం గమనార్హం. ఫ్రీలాన్స్ కార్టూనిస్టుల అసోసియేషన్ కూడా మొదట కరీంనగర్‌లోనే ఆవిర్భవించగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పాటు చేసుకుని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆన్‌లైన్ వేదికగా ముందుకు సాగుతుండటం విశేషం.

గ్రేట్ అచీవ్‌మెంట్ : మామిడి హరికృష్ణ, రాష్ట్ర అధికార భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు

‘కకా’ పేరిట ఫస్ట్ డాక్యుమెంటరీ తయారు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కార్టూనిస్టులను అభినందిస్తున్నా. తమదైన ఆలోచనలతో వ్యంగ్య చిత్రాలు వేసే కార్టూనిస్టులను ప్రొత్సహించే సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. రాష్ట్రంలో పలుమార్లు ప్రదర్శనలు ఏర్పాటు చేయడమే కాకుండా కార్టూనిస్టులను గౌరవించే ఆనావాయితీని ఆరంభించాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా ఉత్తమ కార్టూనిస్టులను ఎంపిక చేసి నగదు ప్రోత్సాహం అందించిన చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఇప్పుడు డిజిటల్ మీడియా కేంద్రంగా రాష్ట్రంలోని వ్యంగ్య చిత్రకారులు బాహ్య ప్రపంచానికి పరిచయం అవుతున్న విధానం దేశానికే ఆదర్శం. రానున్న కాలంలో మన కళాకారులకు అన్నింటా ప్రోత్సాహం అందించేందుకు ప్రయత్నిస్తా’

కరీంనగరే దిక్సూచి: జకీర్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు

కార్టూనిస్టులంతా ఒకే వేదిక మీదకు రావాలన్న ఆలోచన కరీంనగర్ నుంచే ఆరంభమైంది. 1996లోనే కరీంనగర్ కార్టూనిస్టుల సంఘం ఏర్పాటు చేసి ఫ్రీలాన్స్ వ్యంగ్య చిత్రకారులను సంఘటితం చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్టేట్ లెవల్ కమిటీ వేశాం. డాక్యుమెంటరీ విధానం కూడా తెలంగాణా నుండే మొదలు కావడం గర్వంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉండటం కరీంనగర్ బిడ్డగా నాకు సంతోషంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా చైతన్యానికి అనుగుణంగా కార్టూన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాం.

కొత్త తరం వెలుగులోకి: రాజమౌళి, సంఘం ప్రధాన కార్యదర్శి

కార్టూనిస్టుల సంఘం ద్వారా నూతన తరాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నేదే మా సంకల్పం. ఇందుకు డిజిటల్ మీడియా రంగం ఎంతో దోహదపడుతుంది. విదేశాల్లో ఉన్నట్టుగా కార్టూనిస్టుల కోసం ప్రత్యేక పోర్టుపోలియో ఉంటే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మా స్పూర్తితో యంగ్ జనరేషన్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. లాంగ్వేజ్, కల్చరల్ డైరక్టర్ మామిడి హరికృష్ణ అందిస్తున్న ప్రోత్సాహం మాలో మరింత బలాన్ని నింపింది.

రానున్న రోజుల్లో ఆన్ లైన్‌లో: కళ్యాణం శ్రీనివాస్, సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ

వర్చువల్ విధానంతో కార్టూన్లను డిజిటల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావచ్చని భావించా. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వర్చువల్ షాపింగ్ విధానం గురించి తెలుసుకుని ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. నెల రోజులపాటు డాక్యుమెంటరీ చేసేందుకు కసరత్తులు చేసి తొలి అడుగు వేశాం. డిజిటల్ మీడియా వేదికగా చేస్తోన్న మా ప్రయత్నం దేశంలోనే మొదటిది. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి కారణం కరోనా లాక్‌‌డౌన్. రానున్న రోజుల్లోనూ మా కళను ప్రదర్శించేందుకు ఆన్‌లైన్ విధానాన్నే అవలంభించాలని అనుకుంటున్నాం.



Next Story

Most Viewed