ఆస్ట్రానాట్స్ దృష్టిలోపాన్ని నిరోధించే ‘స్లీపింగ్ బ్యాగ్’

by  |
Sleeping1
X

దిశ, ఫీచర్స్: టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త వాక్యూమ్-ఎక్విప్డ్ స్లీపింగ్ బ్యాగ్‌ను రూపొందించారు. ఇది సుపీన్ పొజిషన్‌(ముఖం పైకి ఉంచి పడుకోవడం)లో నిద్రిస్తున్నప్పుడు సహజంగా మన తలలోకి ప్రవహించే శరీర ద్రవాలను కిందికి లాగగలదు. ఈ ద్రవాలు అంతరిక్షంలో వ్యోమగాములు దృష్టి సమస్యలతో బాధపడేందుకు కారణం కాగా.. దీన్ని నిరోధించేందుకు ఉపయోగపడగలదని జామా ఆప్తాల్మాలజీలో ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల ఒక వ్యక్తి మంచం నుంచి లేచిన ప్రతిసారీ కొన్ని ద్రవాలు శరీరంలోకి లాగబడతాయి. దీన్నే ‘అన్‌లోడ్’ అని పిలుస్తారు. కానీ అంతరిక్షంలో, తక్కువ గురుత్వాకర్షణ కారణంగా తలలో సగం గాలన్ల కంటే ఎక్కువ శరీర ద్రవాలు సేకరించబడతాయి. అందువల్ల ఐబాల్‌పై ఒత్తిడి కలుగుతుంది. ఇది స్పేస్‌ఫ్లైట్-అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్( SANS)కు దారి తీస్తుండగా.. క్రమంగా దృష్టి బలహీనతకు కారణమవుతోంది. భూమిపై పడుకున్న వ్యక్తిపై, అంతరిక్షంలో ఉన్నవారి కంటే కొంచెం ఎక్కువగా మెదడుపై ఒత్తిడి ఉన్నప్పటికీ… భూమి మీద వ్యక్తి కొద్ది గంటల తర్వాత రిలాక్స్ అయ్యే చాన్స్ ఉంటుంది. కానీ, వ్యోమగాములు మాత్రం లేచి రిలాక్స్ అయ్యే చాన్స్ లేదు. దీంతో ఈ ఒత్తిడిని నిరంతరం అనుభవిస్తారు. దీనివల్ల మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఫ్లాట్‌గా పడుకున్న ఆస్ట్రోనాట్స్ ఐబాల్ ఆకారం మారే అవకాశమున్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడైంది. కొత్త సక్షన్ టెక్నాలజీని ఉపయోగించినా.. ఎలాంటి మార్పు కనిపించలేదని సైంటిస్టులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు ప్రయాణించిన వ్యోమగామి మైఖేల్ బారట్ SANSతో బాధపడుతున్నట్లు గత సంవత్సరం నాసా తెలిపింది. దీనివల్ల ఆప్టిక్ డిస్క్‌లో వాపు, ఆప్టిక్ నరం రెటీనాలోకి ప్రవేశించడం, కంటి ఆకారంలో మార్పు కనిపిస్తుంది. దాదాపు 70 శాతం మంది సిబ్బందిలో SANS సంకేతాలు కనిపిస్తున్నాయని నాసా హ్యూమన్ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ డైరెక్టరేట్ సైంటిస్ట్ స్టీవ్ లారీ తెలిపారు. కాగా కొత్తగా రూపొందించిన స్లీపింగ్ బ్యాగ్ వ్యోమగాముల దృష్టి దోషాన్ని నివారించడంలో సాయపడనుంది. ఒక దృఢమైన ఫ్రేమ్‌తో స్పేస్ క్యాప్సూల్ ఆకారంలో ఉండే ఈ స్లీపింగ్ బ్యాగ్.. నడుము నుంచి కాళ్ల వరకు ఒక వ్యక్తికి సరిపోతుంది. వాలంటీర్లు పరిశోధన గది, స్లీపింగ్ బ్యాగ్స్‌లో మూడు రోజులపాటు రోజుకు ఎనిమిది గంటలు గడపగా.. ప్రతిసారి మెదడులోని మార్పులను పరిశోధకుల బృందం పోల్చి చూసింది. వాక్యూమ్ క్లీనర్ సూత్రంపై పనిచేస్తున్న ఈ పరికరం.. పాదాలవైపు ద్రవాన్ని కిందకి లాగి ఐబాల్‌ ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. అయితే వ్యోమగాములు ప్రతిరోజూ స్లీపింగ్ బ్యాగ్‌లో ఎంత సమయం వెచ్చించాలనే దానితో సహా, స్లీపింగ్ బ్యాగ్ టెక్నాలజీని మామూలుగా ఉపయోగించే ముందు అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. మైక్రోగ్రావిటీలో హృదయ స్పందన ప్రమాదాన్ని పెంచే అసాధారణ రక్త ప్రవాహాన్ని నిరోధించడంలోనూ స్లీపింగ్ బ్యాగ్ సహాయపడే అవకాశం ఉందని చెప్తున్నారు.


Next Story

Most Viewed