మావోయిస్టులకు సహకరించేందుకు సిద్ధంగా లేరు: ఎస్పీ సునీల్ దత్

by  |
మావోయిస్టులకు సహకరించేందుకు సిద్ధంగా లేరు: ఎస్పీ సునీల్ దత్
X

దిశ, కొత్తగూడెం: తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దు గ్రామాలైన కొండవాయి, కొరకట్ పాడు, ఎర్రంపాడు, పుట్టపాడు, బూరుగుపాడు, నెమలిగూడ, కుర్ణపల్లి నుండి అమాయకపు ఆదివాసీ ప్రజలను బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ నాయకులైన ఆజాద్ ,మధులు బలవంతంగా శనివారం పెసర్లపాడు ఏరియాలో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని భయపెడుతున్నారని చెప్పారు. మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావడానికి గ్రామాల ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. కానీ నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్,మధు,రాందాస్,రాజేష్ లు ఈ గ్రామాల ఆదివాసీ ప్రజలను భయపెడుతూ సమావేశాలకు హాజరుకావాలని వేధిస్తున్నారని అన్నారు. సమావేశాలకు హాజరుకాని వారిని పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేస్తున్నారని అన్నారు.

మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకపు గిరిజనులను వారి కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇటువంటి కార్యకలాపాల వలన ఆదివాసీ ప్రజలు నష్టపోయి మావోయిస్ట్ పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతే కాకుండా వీరి వద్ద నుండి బలవంతంగా బియ్యం,కూరగాయలు, డబ్బులను లాక్కొంటున్నారని అన్నారు. 3 సంవత్సరాల క్రితం ఆజాద్ భార్యను అరెస్టు చేసి జైలులో ఉంచామని, అప్పటి నుండి ఆజాద్ తనతో పాటు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో కలిసి కాంట్రాక్టర్లను, వ్యాపారస్తులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసి తన భార్య బెయిల్ కొరకు, వారి విలాసాలకు వాడుకున్నట్లు తెలిసిందన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వానికి తెలియకుండా ఇవి చేస్తున్నారని అన్నారు.



Next Story

Most Viewed