కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు.. కారణమెవరంటే ?

by  |
govt land
X

క్యాతనపల్లి, దిశ : పేదవాడికి సెంటు భూమి ఇవ్వాలంటే అధికారులు సవాలక్ష ప్రశ్నలు అడిగి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటారు. కానీ క్యాతన పల్లి పురపాలకంలో కొందరు అక్రమార్కుల కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నా చూసి చూడనట్లు వ్యవహరించడం అధికారుల వంతైంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పురపాలకంలో క్యాతనపల్లి ఒకటి కావడంతో భూముల ధరలు పెరుగుతుందన్న ఆశతో కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పురపాలక పట్టణం రామకృష్ణాపూర్ లోని గాంధీనగర్ సర్వే నెంబరు 7 లో ప్రభుత్వ భూమిలో అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడగా భూమిలో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డు నిర్మించారు.

అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డును, ప్రభుత్వ చట్టాలను బేఖాతరు చేసి నాయకులు ఏకంగా ఇల్లు నిర్మాణం చేపట్టినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భగత్ సింగ్ నగర్, ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారి క్రాంతి కాలేజీ ఎదురుగా ఉండే రెండు చోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేసి కంచె నిర్మించగా అధికారులు కంచె తొలగించ లేకపోయారు. అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలతో భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లు లోని కొన్ని షేడ్ల ను కూలగొట్టి మరికొన్నింటిని వదిలిపెట్టడం లో అధికారుల ఆంతర్యమేమిటని పుర ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగిస్తూ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న భూబకాసురులు పై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed