ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రతికూలంగా ఉండొచ్చు'!

by  |
ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రతికూలంగా ఉండొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.5 శాతం ప్రతికూలంగా నమోదైంది. తొలి త్రైమాసికంలో నమోదైన ప్రతికూల క్షీణతతో పోలిస్తే ఇది చాలా మెరుగైనది. అంతేకాకుండా, సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనాలను అధిగమించి మెరుగైన వృద్ధి రేటు సాధించాయి. సెప్టెంబర్‌లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో వృద్ధి రేటు మెరుగైన సంఖ్యలను నమోదు చేసింది. అయితే, సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి క్షీణత ఊహించిన దానికంటే తగ్గినప్పటికీ.. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఆర్థికవ్యవస్థపై రానున్న త్రైమాసికాల్లో కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు మందగించి, ఊహించిన దానికంటే కాస్త ఎక్కువ సానుకూలంగా కనిపిస్తోంది.

అయినప్పటికీ, అప్రమత్తంగా ఉండటం ముఖ్యమంటున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ 2017, డిసెంబర్ నాటి స్థాయికి చేరుకుంది. దేశ ఆర్థికవ్యవస్థ వ్యవస్థీకృత రంగంలోని ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అసంఘటిత రంగానికి సంబంధించి గణాంకాలు అందుబాటులో లేవు. ఈ గణాంకాలు ఉంటే వృద్ధి రేటు మరింత ప్రతికూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో వృద్ధి రేటు 15.7 శాతం ప్రతికూలంగా ఉండొచ్చు. తొలి ఆరు నెలలు రెండంకెల సంకోచం కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరానికి రెండంకెల ప్రతికూలత నమోదైన ఆశ్చర్యం కలగదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చివరి రెండు త్రైమాసికాల్లో ప్రతికూలంగానే ఉండే అవకాశాలున్నాయని, రెండంకెల ప్రతికూలత లేకపోయినా ఆర్థిక సంవత్సరం ప్రతికూలంగా ముగించే అవకాశాలున్నాయంటున్నారు.

Next Story

Most Viewed