అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న గుంటూరమ్మాయి..!

by  |
అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న గుంటూరమ్మాయి..!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనత సాధించారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్ధం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్నారు. అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టబోతున్న తెలుగు మూలాలున్న మహిళ శిరీష కావడం విశేషం. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ వ్యోమనౌకను ఈ నెలలోనే నింగిలోకి పంపనుంది. సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులతో వ్యోమ నౌక అంతరిక్షంలో అడుగుపెట్టబోతుంది. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​ కూడా చోటు సంపాదించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ అంతరిక్ష వాణిజ్య యాత్రకు సంబంధించి మొత్తం ఆరుగురితో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి హాబ్‌నాబ్ చేయటం! గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిపి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుంది. వర్జిన్ గెలాక్టిక్ ఇప్పటికే మూడు అంతరిక్షయానం చేపట్టింది. అయితే ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. అంతరిక్ష ప్రయాణాల కోసం వర్జిన్ గెలాక్టిక్‌ సంస్థ ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.

ఆంధ్రా నుంచి అమెరికాకు

శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరులో జన్మించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. శిరీష బండ్ల 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరారు. అప్పటి నుంచి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన శిరీషా జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తోన్న తొలి తెలుగు మూలాలున్న మహిళ శిరీష కావడం విశేషం. అంతకుముందు భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ అంతరిక్షంలో అడుగుపెట్టారు.

బెజోస్‌కు పోటీగా

అపర కుబేరుడు, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఈ నెల 20న తన సంస్థ బ్లూ ఆరిజిన్‌ ప్రయోగించే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు పోటీగా వర్జిన్‌ గెలాక్టిక్‌ ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. బెజోస్ అంతరిక్ష పర్యటన కంటే ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ 9 రోజుల ముందు అంతరిక్షంలోకి వెళ్లడం గమనార్హం.

Next Story

Most Viewed