సిరాజ్.. రావాల్సిందే..

by  |
సిరాజ్.. రావాల్సిందే..
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నైలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు తుది జట్టులో మహ్మద్ సిరాజ్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతడిని పక్కన పెట్టారని అందరూ సర్దుకొని పోయారు. దీంతో చర్చంతా కుల్దీప్ యాదవ్ పైనే జరిగింది. అనుభవలేమి కలిగిన స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపించలేకపోయారని విమర్శలు వచ్చాయి. కుల్దీప్‌ను తుది జట్టులో చేర్చితే బాగుండేదని అందరూ అన్నారు. కానీ కెప్టెన్ కోహ్లీ మాత్రం కుల్దీప్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సరైన కారణం వివరించాడు. అదే సమయంలో సిరాజ్ గురించి ఎవరూ ప్రస్తావించలేదు. కానీ అటు బుమ్రా, ఇటు ఇషాంత్ శర్మలు మాత్రం తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించలేదు. అదే సమయంలో 38 ఏళ్ల అండర్సన్ మాత్రం భారత బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచాడు. తన రివర్స్ స్వింగ్ బంతులతో స్పీన్నర్లకు ధీటుగా బంతిని అటూ ఇటూ స్వింగ్ చేసి ముప్పతిప్పలు పెట్టాడు.

స్వింగ్ ఒక కళ..

పేసర్లు బంతిపై ఉన్న సీమ్‌ను ఉపయోగించుకుంటూ స్వింగ్ చేయడం సాధారణమే. అయితే పాతబడిన బంతిని కూడా స్వింగ్ చేయగలగడం ఒక గొప్ప నైపుణ్యం. వసీమ్ అక్రమ్ ఇలాంటి స్వింగ్ బంతులకు ఆద్యుడు. టెస్టు మ్యాచ్ నాలుగు, ఐదవ రోజు కూడా స్వింగ్ చేయగల సత్తా అక్రమ్‌లో ఉండేది. టీమ్ ఇండియాలో జహీర్‌ఖాన్ అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కూడా మంచి స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో భువనేశ్వర్ కుమార్ మంచి స్వింగ్ బంతులు వేయగలడు. కానీ గాయం కారణంగా టెస్టు జట్టుకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం ఉన్న ఇషాంత్ శర్మ మంచి వేగంతో లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తాడు. జస్ప్రిత్ బుమ్రా యార్కర్లు అద్భుతంగా సంధించగలడు. కానీ స్వింగ్ చేయడం కొంచెం కష్టమే. పైగా బుమ్రా తొలి సారి ఇండియన్ పిచ్‌లపై టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. గతంలో అతడు దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ ఆడిన అనుభవం కూడా పెద్దగా లేదు. దీంతో చెన్నై టెస్టులో స్పిన్నర్లు వికెట్లు తీయగలిగినా.. వారికి తోడుగా పేసర్లు వికెట్లు కూల్చలేక పోయారు.

సిరాజ్ ఉంటే..

రెండో టెస్టు కూడా చెన్నైలోని చేపాక్ స్టేడియంలోనే జరుగనున్నది. తొలి టెస్టుకు వాడిన పిచ్‌ కాకుండా వేరే పిచ్‌ను ఉపయోగించనున్నారు. అయినా సరే రెండు పిచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయని అక్కడి క్యూరేటర్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు మహ్మద్ సిరాజ్‌ను తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంటున్నారు. మహ్మద్ సిరాజ్ కొత్త, పాత బంతులతో రాణించే సత్తా కలిగిన పేసర్. మూడేళ్ల క్రితం అతడు కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లో 37 వికెట్లు తీశాడు. బెంగళూరులో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పాతబడిన బంతితో రివర్స్ స్వింగ్ సాధించి ఎనిమిది వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే ఇవ్వడం గమనార్హం. ఆనాడు అతడు తీసిన వికెట్లలో మార్నస్ లబుషేన్ కూడా ఉన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సిరాజ్‌లో ఉన్న రివర్స్ స్వింగ్ సత్తాను గతంలోనే ప్రశంసించాడు. అయినా తొలి టెస్టులో అవకాశం ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో టెస్టులో భారత జట్టు పేస్ బలం పెరగాలంటే స్వింగ్ చేసే సత్తా ఉన్న సిరాజ్‌ రావాల్సిందే అని విశ్లేషకులు చెబుతున్నారు. భువనేశ్వర్ వంటి స్వింగర్లు లేని సమయంలో సిరాజ్ సేవలు తప్పక ఉపయోగించుకోవాలని అంటున్నారు.

Next Story

Most Viewed