ఇండిగో తీరుపై సింగర్ వీణా శ్రీవాణి గరంగరం

by  |
Singer Veena Srivani
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తీరుపై సింగర్ వీణా శ్రీవాణి అసహనం వ్యక్తం చేశారు. ఓ షో నిమిత్తం వీణా శ్రీవాణి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే ఆమె రాజమండ్రిలో ఫ్లైట్ దిగినప్పటికీ లగేజీ మాత్రం రాలేదు. లగేజీ కోసం ఆరా తియ్యగా తర్వాత విమానంలో వస్తుందంటూ ఇండిగో సిబ్బంది సమాధానం చెప్పడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు లగేజీ రాకపోవడం ఏంటంటూ నిలదీశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

‘షో కోసం నా బృందంతో కలిసి రాజమండ్రి వచ్చాను. నిబంధనలకు అనుగుణంగా మేము లగేజీ తెచ్చుకున్నప్పటికీ.. అది మోతాదుకు మించి ఉందంటూ ఫ్లైట్‌ ఎక్కే సమయంలో అధికారులు మా వద్ద నుంచి కొంత డబ్బు వసూలు చేశారు. తీరా రాజమండ్రి వచ్చాక మా లగేజీ మాత్రం రాలేదు. ఆ విషయంపై ఇండిగో అధికారులను ప్రశ్నిస్తే.. మేము వచ్చిన ఫ్లైట్‌లో ఖాళీ లేదని.. మరో విమానంలో లగేజీని తీసుకువస్తున్నారని చెబుతున్నారు’అంటూ వీణా శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఓ షో కోసం వచ్చాను. ఆ షో ఆలస్యమైతే నా పరిస్థితి ఏంటి. ఎవరు బాధ్యత వహిస్తారు. ఇది మా జీవితం. మా జీవితాలతో ఆడుకోకూడదు. ఒకవేళ లగేజీ మరో విమానంలో తీసుకువచ్చేటట్లు అయితే.. ప్రయాణం ప్రారంభమైన వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి కదా అని నిలదీశారు. ఒకవేళ అనారోగ్యం బారిన పడిన వారు ఉంటే వారి పరిస్థితి ఇంతేనా అంటూ మండిపడ్డారు. లగేజీ ఎప్పుడు తన వద్దకు చేరుకుంటుందో చెప్పాలని ప్రశ్నించగా ఇండిగో సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమె అక్కడ నుంచి అసంతృప్తితో వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే ఇండిగో విమానంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే రాజమండ్రి నుంచి తిరుపతికి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానం బెంగళూరులో ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో ఎమ్మెల్యే రోజా, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఇతర ప్రముఖులు ఉన్న సంగతి తెలిసిందే. వారంతా ఇండిగో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రోజా అయితే ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed