స్థలం కబ్జా విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం.. బీరు సీసాలతో దాడి

by  |
స్థలం కబ్జా విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం.. బీరు సీసాలతో దాడి
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్‌లోని ఫైవింక్లైన్ ఏరియాలో వివాదం ముదురుతోంది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడులకు దిగుతున్నారు. డివిజన్‌లో వాటర్ ప్లాంట్ నిర్మాణం పేరుతో స్థలం కబ్జాకు ఓ కార్పొరేటర్ ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో స్థానికులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సింగరేణికి చెందిన స్థలాన్ని కబ్జా చేసిన కార్పొరేటర్ స్థలాన్ని చదును చేయించి పోల్స్ పాతాడు. సిమెంటు ఇటుకలు తెప్పించి నిర్మాణాన్ని దగ్గరుండి చేయించే ప్రయత్నం చేశాడు.

అయితే, స్థానికులు అక్కడ నిర్మాణం చేపట్టవద్దని గొడవకు దిగడంతో పనులను నిలిపి వేశారు. సోమవారం ఈ విషయంపై చర్చించుకుందాం అని చెప్పాడు. కాగా, సింగరేణికి చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సింగరేణి అధికారులు కూడా కార్పొరేటర్‌కు వత్తాసు పలుకుతున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ స్థల వివాదంపై ఆదివారం రాత్రి రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో కొట్టుకోవడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అతడిని స్థానికంగా చికిత్స చేయించినట్లు తెలిసింది. అయితే, సోమవారం ఉదయం ఇరు వర్గాలు మళ్ళీ గొడవకు దిగాయి. తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు. ఇది కాస్తా కొట్టుకునే స్థాయికి వెళ్ళింది.

అయితే, ఒక కార్పొరేటర్ అక్కడకు చేరుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. అందరం కూర్చొని మాట్లాడుకుందామని సూచించాడు. ఏది ఏమైనా సింగరేణికి చెందిన స్థలాన్ని దర్జాగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు నిలిపి వేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed