మరో రికార్డ్ సాధించిన సింగరేణి.. ఉద్యోగులకు అభినందనలు తెలిపిన సీఎండీ శ్రీధర్

by  |
Singareni-Employees
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: సింగరేణి మళ్లీ సిరులు కురిపిస్తోంది. కరోనా పరిస్థితులను అధిగమించి సంస్థ అద్భుతమైన వృద్ధి సాధిస్తోంది. ఎనిమిది నెలల కాలంలో అమ్మకాల్లో 63 శాతం వృద్ధి సాధించడమే కాకుండా, నష్టాల నుంచి బయటపడింది. రూ. 924 కోట్ల లాభాలను ఆర్జించింది. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 8 నెలల్లో రూ. 16,512 కోట్ల అమ్మకాలను జరిపి రికార్డు నెలకొల్పింది. ఇది గత ఆర్థిక సంవత్సరం జరిపిన రూ. 10,127 కోట్ల అమ్మకాల కన్నా 63 శాతం అధికం. అంతేకాకుండా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రూ. 1,038 కోట్ల నష్టాలను చవిచూడగా, ఈసారి 189 శాతం వృద్ధితో రూ. 924.4 కోట్ల లాభాలు గడించింది. టర్నోవర్‌, లాభాల్లో కోలిండియాతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలకన్నా సింగరేణి ఎంతో మెరుగైన అభివృద్ధి సాధించడం గమనార్హం.

బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో వృద్ధి

కోవిడ్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సింగరేణి గతేడాది రూ. 7,979 కోట్ల బొగ్గు అమ్మకాలను జరిపింది. సింగరేణి యాజమాన్యం రూ. 73 కోట్ల వ్యయంతో తీసుకున్న కరోనా నివారణ చర్యల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం 8 నెలల్లో రూ. 13,973 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపి గతేడాది ఇదే కాలానికి 75 శాతం వృద్ధిని నమోదు చేసింది. విద్యుత్ అమ్మకాల్లోనూ 18 శాతం వృద్ధి సాధించింది. గతేడాది తొలి 8 నెలల కాలంలో రూ. 2,149 కోట్ల విద్యుత్తు అమ్మకాలు జరపగా, ఈ ఏడాది తొలి 8 నెలల్లో 18 శాతం వృద్ధితో రూ. 2,539 కోట్ల విలువైన విద్యుత్తు అమ్మకాలు జరిపింది.

కోలిండియా కంటే బెటర్

కోలిండియాకు సంబంధించి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ తో ఆరు నెలల కాలంలో కోలిండియా తన అమ్మకాలలో 23 శాతం వృద్ధిని నమోదు చేయగా, సింగరేణి 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. కోలిండియా తొలి అర్ధ సంవత్సరం మొత్తం లాభాల్లో (పీబీటీ) 16 శాతం వృద్ధి నమోదు చేయగా, సింగరేణి 201 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా గత 8 నెలల కాలంలో కూడా సింగరేణి తన వృద్ధిని నిలకడగా సాధిస్తూ పురోగమిస్తోంది.

సీఎండీ అభినందనలు

ఎనిమిది నెలల కాలంలో మెరుగైన ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో వృద్ధిని సాధించడం పట్ల సంస్థ సీఎండీ శ్రీధర్‌ హర్షం ప్రకటించారు. సింగరేణి కార్మికులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన మూడున్నర నెలల కాలంలో కూడా నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు.



Next Story

Most Viewed