లాక్‌డౌన్ కాలంలో రూ. 26,242 కోట్ల పన్ను రీఫండ్‌ల చెల్లింపులు!

by  |
లాక్‌డౌన్ కాలంలో రూ. 26,242 కోట్ల పన్ను రీఫండ్‌ల చెల్లింపులు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఆదాయ పన్ను శాఖ ఏప్రిల్ నుంచి సుమారు 17 లక్షల మందికి రూ. 26,242 కోట్ల రీఫండ్స్‌ను జారీ చేసింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెంచేందుకు, దీని ద్వారా డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోన్నది. ఇందులో భాగంగానే గడిచిన రెండు నెలల్లో ఐటీ కార్యాలయం 16,84,289 మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ. 26 వేల కోట్ల ఐటీ రీఫండ్స్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి మే 21 నాటికి ఈ రీఫండ్‌లు జరిగినట్లు ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ) పేర్కొంది. ఇందులో 15,81,906 మందికి రూ. 14,632 కోట్ల ఆదాయ పన్ను రీఫండ్‌లు, 1,02,392 మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ. 11,610 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్‌లు చెల్లించినట్టు ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ప్రజల దగ్గర నగదు లభ్యత పెంచడం, కంపెనీల వద్ద అవసరమైన నిధులను కలిగి ఉండేలా రీఫండ్‌ల జారీ ప్రక్రియను చేపట్టినట్టు పన్నుల బోర్డు వెల్లడించింది. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తర్వాత రీఫండ్‌ల ప్రక్రియ మరింత వేగం అందుకుందని ఐటీ విభాగం పేర్కొంది.

Next Story

Most Viewed