నాగారం ఎస్ఐ‌పై విచారణకు ఎస్‌హెచ్‌ఆర్సీ ఆదేశం

by  |
నాగారం ఎస్ఐ‌పై విచారణకు ఎస్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సివిల్ వివాదంలో తలదూర్చడమే కాకుండా ఫిర్యాదు చేసిన రైతును చంపుతానని బెదిరించిన సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. దిశ న్యూస్ ఛానల్లో మూడు రోజుల క్రితం ప్రసారమైన కథనాన్ని సుమోటో‌గా తీసుకుంది. సెప్టెంబర్ 24వ తేదీ లోగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కర్‌ను ఆదేశించింది.

తిరుమలగిరి మండలానికి చెందిన రైతు ఓర్పు మల్లయ్య‌కు ఈటూరు గ్రామం సమీపంలోని నాగారం శివారులో తండ్రి వారసత్వంగా వచ్చిన భూమి సుమారు 4 ఎకరాలు ఉంది. గతంలో అధికారులు ఈ భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు సైతం అందజేయగా మల్లయ్య 15 సంవత్సరాలుగా కాస్తులో ఉన్నాడు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పాసుపుస్తకాలను రద్దుచేసి కొత్త వాటిని జారీ చేసింది. అయితే అందులో సర్వే నెంబర్ తప్పుగా ఉండటంతో 4 ఎకరాల 20 గుంటలు ఉన్నట్లుగా పాసు పుస్తకం జారీ చేశారు.

దీంతో అదనంగా నమోదైన భూమిని తొలగించి సర్వే నెంబర్‌లను సరిచేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొడుకు అశోక్‌తో కలిసి ఏడాదిగా తిరుగుతున్నాడు. అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తూ పాసు పుస్తకాలను మార్చలేదు. ఇదే అదునుగా భావించిన పాలేరు సోమయ్య కొంత భూమిని కబ్జా చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు సైతం చేసుకున్నారు.

ఈ క్రమంలో మల్లయ్య , సోమయ్యలు నాగారం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఎస్ఐ లింగం మల్లయ్య, అతని కుమారుడు అశోక్‌ను స్టేషన్‌కు పిలిచి తాను చెప్పినట్లు నడుచుకోవాలని, లేని పక్షంలో చంపుతానని బెదిరించాడు. వినకపోవడంతో స్టేషన్‌లో లాఠీలతో చితక బాదాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీ భాస్కర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ కథనాన్ని దిశ టీవీ ప్రసారం చేసింది. దీనిని సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది.

Next Story

Most Viewed