మహిళలే క్యాబ్ డ్రైవర్లు.. ఇకపై ప్రయాణం మరింత సురక్షితం

by  |
మహిళలే క్యాబ్ డ్రైవర్లు.. ఇకపై ప్రయాణం మరింత సురక్షితం
X

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మనం ఇంతవరకు పురుషులే క్యాబ్ డ్రైవర్లుగా ఉండడం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా మహిళలు కూడా క్యాబ్ డ్రైవ‌ర్లుగా ప‌ని చేసే అవ‌కాశం తెలంగాణ ప్రభుత్వం క‌ల్పిస్తోంది. దీంతో సురక్షిత ప్రయాణ అనుభూతి కోసం ఇక పై మహిళ‌లే క్యాబ్స్ డ్రైవర్లుగా వ్యవహరించనున్నారు. మ‌హిళాభివృద్ధి ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆస‌క్తి ఉన్న మ‌హిళ‌ల‌కు 35 శాతం రుణంతో స‌బ్సీడి క‌ల్పించి వారికి క్యాబ్‌లు పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇందుకు వారు 10 శాతం మార్జిన్ మ‌నీ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. మొత్తం మీద బ్యాంక్‌లు అందించే రుణంతో న‌గ‌రంలో షీటాక్సీలు త్వర‌లో అందుబాటులోకి రానున్నాయి. షీ ట్యాక్సీ ప‌థ‌కం ద్వారా ఎంపికైన మ‌హిళ‌ల‌కు వాహ‌నం న‌డ‌ప‌డంలో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు,మ‌హిళ‌లు, ఇత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చే మ‌హిళా టూరిస్టుల ర‌క్షణతో కూడిన ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంట‌ల పాటు అందుబాటులోఉండేటా ఈ ప‌ధ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది.

30 రోజుల పాటు శిక్షణ‌…

షీ ట్యాక్సీ ప‌థ‌కం కింద ఉమ్మడి ప‌ది జిల్లాల్లో ల‌బ్ధిదారుల‌కు శిక్షణ ఇస్తారు . 30 రోజుల పాటు కొన‌సాగే శిక్షణ స‌మ‌యంలో వ‌స‌తితో కూడిన స‌దుపాయాన్ని అధికారులు క‌ల్పిస్తారు. ప‌ద‌వ త‌ర‌గ‌తి పాసై ఉండి 18 సంవ‌త్సరాలు పై బ‌డిన యువ‌తులు , మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ద‌ర‌ఖాస్తుదారులు త‌ప్పనిస‌రిగా బిలో పావ‌ర్టీ లైన్ (బీపీఎల్) కుటుంబాలకు చెందిన ప్రాధాన్యత ఉంటుంది.

ఈ నెల 28 చివ‌రి తేదీ..

షీ ట్యాక్సీ ప‌థకం కింద అర్హులైన మహిళలు ఈ నెల 28లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను హైద‌రాబాద్ క‌లెక్టర్ కార్యాల‌యంలోని జిల్లా సంక్షేమ అధికారి మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్యాల‌యంలో అంద‌జేయ‌వ‌ల‌సి ఉంటుంది. అన్ని కేట‌గ‌రిల‌కు చెందిన మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను సీపీడీవో కార్యాల‌యంలో పొంద‌వ‌చ్చు.

మ‌హిళ‌ల‌కు ఎంతో ర‌క్షణ …

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉద్యోగ‌, వ్యాపార ప‌నుల నిమిత్తం బ‌య‌ట‌కు వ‌చ్చే మ‌హిళ‌ల భ‌ద్రత కోసం పోలీసులు ఎన్నో ర‌క్షణ చ‌ర్యలు చేప‌డుతున్నారు . అయినా ఎక్కడో ఓ చోట అప్పుడ‌ప్పుడు మ‌హిళ‌ల‌పై దాడుల సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో శంషాబాద్ లో జ‌రిగిన దిశ సంఘ‌ట‌న ఇంకా అంద‌రి కండ్ల ముందే క‌ద‌లాడుతోంది. అంతేకాకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు,యువ‌తులు రాత్రి స‌మ‌యంలో విధులు ముగించుకుని ఇండ్లకు చేరుకుంటారు .వారికి కంపెనీలు సొంత వాహ‌నాల‌ను స‌మ‌కూరుస్తున్నప్పటికీ కొన్ని సంద‌ర్భాల‌లో వారిపై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే షీ ట్యాక్సీ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తెచ్చింది.



Next Story

Most Viewed