‘స్టోన్ క్రషర్స్’తో పెనుప్రమాదం.. మూసివేసేలా ఆర్డర్స్ ఇవ్వండి : SFI శ్రీకాంత్

by  |
‘స్టోన్ క్రషర్స్’తో పెనుప్రమాదం.. మూసివేసేలా ఆర్డర్స్ ఇవ్వండి : SFI శ్రీకాంత్
X

దిశ, శాయంపేట : హన్మకొండ జిల్లాలోని తారాపూర్, మందారీపేట, గోవిందపూర్, పెద్దకొడపాక గ్రామాల పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్స్‌ను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం క్రషర్స్‌ను మూసి వేయాలని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ బద్రు నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్రషర్స్‌ను నడుపుతూ పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేస్తున్నారని.. కార్మికులకు ఎలాంటి రక్షణ కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

ఏకంగా 160 నుంచి 170 ఫీట్ల లోతులో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌లు చేస్తున్నారని.. దీనివలన తారాపూర్, మందారిపేట, గోవిందపూర్, పెద్దకొడపాక గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా ఈ గ్రామాల్లోని ఇండ్ల పై కప్పులు కదులు తున్నాయని, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోతున్నాయని తెలిపారు. ఈ క్రషర్‌లో పనిచేసే లారీలు హెవీ లోడ్‌తో తీసుకెళ్తూ, ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకుండా వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.

బ్లాస్టింగ్ వలన దుమ్ము మొత్తం పంట పొలాలపై పేరుకుపోతుందని, దీనివలన రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఈ క్రషర్స్‌కు సమీపంలో ఉన్న కస్తూరిబా గాంధీ (KGVB) హాస్టల్ విద్యార్థులు బ్లాస్టింగ్, సౌండ్ పొల్యూషన్ వలన భయభ్రాంతులకు గురవడమే కాకుండా.. దుమ్ము ధూళి వలన అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఇన్ని సమస్యలకు కారణమైన క్రషర్స్‌లను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాలు చేపడతామన్నారు.

Next Story

Most Viewed