కరోనా కట్టడికి క్వారంటైన్ సెంటర్లు

by  |
కరోనా కట్టడికి క్వారంటైన్ సెంటర్లు
X

దిశ, న‌ల్లగొండ‌ : తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో నల్గొండ జైల్‌ఖానా సమీపంలోని ప్రార్థనా మందిరానికి వియత్నాం బృందం వచ్చిందన్న విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్కడ ఉన్న 12 మంది పెద్దలతో పాటు ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ప‌రీక్షల నిమిత్తం శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి త‌ర‌లించారు. దీంతో జైల్ ఖానా ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెలకొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా.. రాష్ట్ర రాజధానికి సమీపంలో గల బీబీన‌గ‌ర్ ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు ఓఆర్ఆర్‌కు చేరువ‌గా భువ‌న‌గిరిలోని ఆరోరా ఇంజినీరింగ్ క‌ళాశాల‌, గురుకుల బాలిక‌ల వ‌స‌తి గృహాన్ని క్వారంటైన్ కోసం ఎంపిక చేశారు. ఒక్కో చోట 200 ప‌డ‌క‌లు సిద్ధం చేస్తున్నారు. కరోనా అనుమానితులతో పాటు విదేశాల నుంచి వారిని అబ్జర్‌వేష‌న్ నిమిత్తం 14 రోజుల పాటు ఈ క్వారంటైన్ శిబిరాల్లో ఉండే విధంగా చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో క్వారంటైన్‌ సెంటర్‌లో ముగ్గురు వైద్యులు, ముగ్గురు న‌ర్సులు, 10 మంది ఏఎన్ఎంలు, 20 మంది ఆశాలు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. భూదాన్‌పోచంప‌ల్లి మండ‌లం దేశ్‌ముఖిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడాన్ని అక్కడి గ్రామ‌స్తులు వ్యతిరేకిస్తుండ‌టంతో అధికారులు మ‌రో చోటును వెతుకుతున్నారు.

న‌ల్లగొండ‌లో వియత్నాం వాసుల క‌ల‌క‌లం..

వియత్నాంకు చెందిన పర్యాటకులు మార్చి 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడి నుంచి రైలులో ప్రయాణించి మార్చి 9న హైదరాబాబాద్ స్టేషన్ (నాంపల్లి)కు చేరుకున్నారు. అదే రోజున నల్గొండకు వెళ్లి, పది రోజులుగా అక్కడే ఉన్నారు. అయితే, కరీంనగర్‌లో ఇండోనేషియన్లకు కరోనా రావడంతో అప్రమత్తమైన పోలీసులు నల్గగొండలో ఉన్న వియత్నాం వాసులను కూడా అదుపులోకి తీసుకొని మొదట హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డకు తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు.

రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో చెక్‌పోస్టులు..

క‌రోనా క‌ట్టడి కోసం తెలుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతాలైన న‌ల్లగొండ‌, సూర్యాపేట జిల్లాల్లో మూడు చోట్ల రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం గుండా వ‌చ్చే వాహ‌నాదారుల‌ను అక్కడ ఆపి వారికి టెంప‌రేచ‌ర్‌తో పాటు ల‌క్షణాల‌ను గ‌మ‌నిస్తున్నారు. వారికి మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అందించి చేతుల‌ను శుభ్రంచేయిస్తున్నారు. తెలంగాణ‌కు చెందిన ప్రజ‌ల‌కు క‌రోనా ల‌క్షణాలు గుర్తిస్తే నేరుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డానికి ప్రత్యేక వాహ‌నాల‌ను చెక్‌పోస్టుల వ‌ద్ద ఏర్పాటు చేశారు. ఇత‌ర రాష్ర్టాల‌కు చెందిన వారినైతే ఆధార్ కార్డుల ఆధారంగా గుర్తించి, వారి సమాచారాన్ని అక్కడి ప్రభుత్వాల‌కు తెలియజేస్తారు. శుక్రవారం ఉద‌యం నుంచి జిల్లాలో మూడు చోట్ల చెక్ పోస్టులు ప్రారంభ‌మయ్యాయి.

Tags: Corona, Bibinagar, AIIMS, Bhongir, Quarantine center, 24×7 services



Next Story

Most Viewed