మళ్లీ నష్టాల్లోనే మార్కెట్లు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. మరోవైపు ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థల షేర్ల కోనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని, దీనికి తోడు బుధవారం ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడంతో గురువారం సహజవాయువు ఉత్పత్తి సంస్థల కౌంటర్లలో జోరుగా ట్రేడింగ్ జరిగినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సైతం బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనానికి కారణాలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 379.14 పాయింట్లు పతనమై 51,324 వద్ద ముగియగా, నిఫ్టీ 89.95 పాయింట్లు కోల్పోయి 15,118 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, మెటల్, ఎనర్జీ రంగాలు పుంజుకోగా, ఆటో రంగం డీలాపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 8 శాతానికిపైగా ర్యాలీ చేసింది. ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.72 వద్ద ఉంది.



Next Story

Most Viewed