కరోనా ఎఫెక్ట్: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by  |
కరోనా ఎఫెక్ట్: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కరోనా భయాలు అలుముకున్నాయి. దేశంలోని కీలక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. కేవలం ఒక్కరోజులో సెన్సెక్స్ 3.44 శాతం, నిఫ్టీ 3.53 శాతం పతనమవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద సింగిల్ డే క్రాష్‌గా నమోదైంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం, టీకా పంపిణీ మందగించడం, వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,707.94 పాయింట్లు పతనమై 47,883 వద్ద ముగియగా, నిఫ్టీ 524.04 పాయింట్లు కోల్పోయి 14,310 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 9 శాతం కుదేలవగా, మెటల్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా రంగాలు 2-5 శాతం మేర దిగజారాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం 5 శాతానికిపైగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీ మాత్రమే లాభాలను సాధించగా మిగిలిన షేర్లన్నీ కుప్పకూలాయి.

ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 8.60 శాతం దిగజారగా, బజాజ్ ఫైనాన్స్ 7.39 శాతం, ఎస్‌బీఐ 6.87 శాతం, ఓఎన్‌జీసీ, టైటాన్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్‌టీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ తీవ్రంగా బలహీనపడి రూ. 75.07 వద్ద ట్రేడయింది. కరోనా కేసులతో పాటు ఫిబ్రవరి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో దలాల్ స్ట్రీట్‌లో మదుపర్ల సంపద రూ. 8.69 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ పతనంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 200.94 లక్షల కోట్లకు చేరుకుంది.



Next Story

Most Viewed