సూచీల జోరు తగ్గలే.. మరోసారి ఆల్‌ టైం రికార్డు

by  |
bull-fast
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ లాభాలను సాధించాయి. గత ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు గురువారం మెరుగ్గా ర్యాలీ చేశాయి. దేశీయ మార్కెట్లో ఉన్న సానుకూల పరిస్థితులకు తోడు విదేశీ పెట్టుబడిదారులు గణనీయమైన కొనుగోళ్లను కొనసాగించడంతో మరోసారి రికార్డు గరిష్ఠాలు నమోదయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హై స్థాయిల వద్ద కదలాడాయి. ఉదయం ప్రారంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లను సిద్ధపడటంతో మిడ్-సెషన్ సమయానికి స్టాక్ మార్కెట్లు 54,874 వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అదే స్థాయిలో మార్కెట్లు ముగుస్తాయని ఇన్వెస్టర్లు భావించినప్పటికీ చివర్లో సూచీలు స్వల్పంగా వెనక్కి తగ్గాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 318.05 పాయింట్లు ఎగసి 54,843 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 82.15 పాయింట్ల లాభంతో 16,364 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సహా అన్ని అంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్ అత్యధికంగా 6 శాతానికి పైగా దూసుకెళ్లగా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు అధిక లాభాలను సాధించాయి. డా రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.26 వద్ద ఉంది.


Next Story

Most Viewed