పోలీసుల ఆవేదన.. ప్రమోషన్ల ప్రక్రియలో అన్యాయం..!

by  |
పోలీసుల ఆవేదన.. ప్రమోషన్ల ప్రక్రియలో అన్యాయం..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సాధారణంగా ఏ ప్రభుత్వ విభాగంలో అయినా సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుని పదోన్నతులు కల్పిస్తుంటారు. పోలీసు శాఖలో మాత్రం విచిత్ర తంతు సాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్నఈ తప్పిదాన్ని సవరించేందుకు పెద్ద సార్లు సాహసించడం లేదు. స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత కూడా తమ సమస్య జటిలంగానే మారడంతో రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న పోలీసులు పదోన్నతి లభిస్తుందా లేదా అని ఆవేదన చెందుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వరంగల్, హైదరాబాద్ జోన్లకు చెందిన 1996 బ్యాచ్ సీఐలు కోర్టును ఆశ్రయించారు.

అసలేం జరిగింది?

ఇప్పటికే డీఎస్సీలుగా పదోన్నతి పొంది అడిషనల్ ఎస్సీ సినియారిటీ లిస్ట్ లో చేరాల్సిన 1995 బ్యాచ్ సీఐలు నేటికీ సీఐలుగానే మిగిలిపోయారు. తమకు న్యాయం చేయాలని 2019లో కరీంనగర్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ను కలిసి వేడుకున్నారు. వీరి పదోన్నతి ప్రక్రియ వెంటనే కంప్లీట్ చేయాలని ఆయన ఉన్నతాదికారులను ఆధేశించారు. ఏడాది దాటినా పదోన్నతులకు మోక్షం కలగలేదు. అన్ని విభాగాలలో పదోన్నతులు సాగుతున్న తరుణంలో వరంగల్ జోన్ 1995 సీఐలతో పాటు 1996, 1998, 1999 బ్యాచ్ ల హైద్రాబాద్ సిటీ అధికారులకు కూడా డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో 1996 వరంగల్ జోన్ సీఐలు తమకు అన్యాయం జరుగుతుందని, జూనియర్లు తమకు బాసులు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తప్పుల తడకగా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిందని తేల్చిన తెలంగాణ పోలీస్ శాఖ మళ్ళీ అదే జీఓ 153 ను ఆధారం చేసుకుని తెలంగాణాలో ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించడం విచిత్రం. 153 జీఓను సవరించే వరకు, తమ కంటే జూనియర్లు అయిన హైద్రాబాద్ సిటీవారికి ప్రమోషన్ ఇవ్వకూడదని 1996 వరంగల్ జోన్ సీఐలు హైకోర్టు ను ఆశ్రయించారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ బ్యాచ్ అయిన వరంగల్ జోన్ 1995 బ్యాచ్ అధికారులకు ప్రమెషన్లు ఇచ్చి మిగతా బ్యాచ్ లకు సమన్యాయం అందే విధంగా చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఏపీ, తెలంగాణ డీజీపీలు పూర్తి వివరాలను నాలుగు వారాలలో సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.

వాస్తవం ఇది

ఉమ్మడి రాష్ట్రంలో పదోన్నతులు యథావిధిగా సాగితే వరంగల్ జోన్ లో మాత్రం అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇతర జోన్ల పోలీసు అధికారులు చకచకా ప్రమోషన్లతో ముందుకు సాగుతుంటే వరంగల్ అధికారులు వాటిని సకాలంలో అందుకోలేకపోయారు. డైరక్ట్ రిక్రూట్ యంగ్ పోలీసు అధికారులు ఉంటే నక్సల్స్ కార్యకలాపాలను నిలువరింవచ్చని అప్పటి పోలీసు అధికారులు భావించారు. కొత్తగా వచ్చేవారికి అవగాహన కల్పించేందుకు చాలా ఆలస్యం అవుతుందని అనుకున్నారు. దీంతో 1989 నుంచి 1996 బ్యాచ్ లకు చెందిన పోలీసు అధికారులు తమతమ స్థానాలకే పరిమితం కావల్సి వచ్చింది. చివరకు వరంగల్ జోన్ పోలీసులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేయడంతో పదోన్నతి అవకాశం కల్పించారు.

ఇతర జోన్లలోని వీరి జూనియర్లకు కూడా అదే విధానం అమలు చేశారు. 1991 బ్యాచ్ వరంగల్ జోన్ అధికారులు దీనిమీద ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా అప్పటి డీఐజీ కమిటీ వేశారు. అది పదోన్నతులలో అన్యాయం జరిగిందని తేల్చింది. అయినప్పటికీ, నష్టపోయిన 57 సీఐ పోస్టులను నేటికీ పరిగణనలోకి తీసుకోకపోవడం విడ్డూరం. సీనియారిటీని ప్రాతిపదికన తాము డీఎస్పీలు కావల్సి ఉంటుందని గోడు వెళ్లబోసుకున్నా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పోలీసు అధికారులకు ప్రమోషన్లలోనూ అన్యాయం జరుగుతోందని ఘాటుగా ఆరోపించారు. 2010లో 1996 బ్యాచ్ వరంగల్ జోన్ అధికారులు కేసీఆర్ ను కలిసి 15 ఏళ్లయినా తాము ఎస్సైలుగానే ఉన్నామని మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన అప్పటి పోలీసు బాసులు, సర్కారుపై ఒత్తిడి తెస్తేగాని వీరి ముచ్చట తీరలేదు. రాష్ట్ర విభజన తరువాత తమకు న్యాయం జరుగుతుందని కలలు కన్న పోలీసులకు ఆరేళ్లయినా అవి సాకారం కాలేదు. తెలంగాణేతర పోలీసు అధికారులే స్వరాష్ట్రంలోనూ పదోన్నతులు పొందుతుండడం గమనార్హం.

వారికలా వీరికిలా

ప్రమోషన్లలో అన్యాయం జరుగుతోందని మూడు దశాబ్దాలుగా వరంగల్ అధికారులు లబోదిబోమంటున్నా పోలీసు బాసులలో చలనం రాలేదు. హైదరాబాద్ సిటీ పోలీసులకు అన్యాయం జరుగుతోందన్న వాదన తెరపైకి తీసుకరాగానే వారికి బాసటగా నిలిచి తమ గొప్ప మనసును చాటుకోవడం విచిత్రమనే చెప్పాలి. నక్సల్స్ ఏరివేతలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆవేదనను గమనించిన అప్పటి సర్కారు యాగ్జిలరీ ప్రమోషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. క్రియాశీలకంగా పనిచేసే పోలీసు అధికారులకు సీనియారిటీని పక్కనపెట్టి మరీ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. హైదరాబాద్ సిటీలో నక్సల్స్ కార్యకలాపాలు లేనందున తమకు అన్యాయం జరుగుతుందని అక్కడి అధికారులు ఆవేదన వ్యక్తం చేయగానే వెంటనే స్పందించిన పోలీసు బాసులు, ప్రభుత్వం సరికొత్త ప్రక్రియను ప్రారంభించారు.

వరంగల్ జోన్ లో నక్సల్స్ కార్యకలాపాలను నిలువరించేందుకు హైదరాబాద్ సిటీ జోన్ నుండి వరంగల్ జోన్ కు, వరంగల్ జోన్ కు చెందిన ఆపీసర్లను సిటీ జోన్ కు బదిలీ చేయాలని నిర్ణయించారు. యాగ్జిలరీ ప్రమోషన్లతో వరంగల్ పోలీసులు లాభపడ్తారన్న కారణంతో ఈ విధానం అమలు చేసిన అధికారులు వరంగల్ జోన్ నుండి హైదరాబాద్ జోన్ కు బదిలీపై వెళ్లినవారికి లాభం చేకూరే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లలో తీరని నష్టాన్ని చవి చూస్తున్న వరంగల్ పోలీసుల బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు.

అసలు కిటుకు

ప్రమోషన్ పొందాలంటే ఆరేళ్లు పాటు ఎస్సైగా, ఆరేళ్ల పాటు సీఐగా పని చేయాలన్న నిభందన ఉంది. వరంగల్ జోన్ పోలీసులకు ఆరేళ్లలో పదోన్నతులు కల్పించని విషయాన్ని పక్కనపెట్టిన అధికారులు వీరికన్నా ముందు ప్రమోషన్ ఫలానా జోన్ వారు పొందారంటూ మెలికపెట్టి మరీ అన్యాయం చేశారన్నది బహిరంగ రహస్యం. ప్రమోషన్లు సకాలంలో కల్పించని తప్పెవరిది? శిక్ష అనుభవిస్తున్నదెవరు అన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు వరంగల్ పోలీసులు.

బాసులుగా జూనియర్లు

ఇప్పుడు తాజాగా సిద్దం చేసిన పదోన్నతుల జాబితాతో జూనియర్లు బాసులుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. హైదరాబాద్ సిటీ జోన్ లో 1996, 1998, 1999 బ్యాచ్ లకు చెందిన ఎస్సైలు ఇప్పుడు సీఐలుగా పదోన్నతి పొంది ఉన్నారు. వారికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీంతో వరంగల్ జోన్ కు చెందిన 1996 బ్యాచ్ వారు సీఐలుగానే మిగిలిపోతున్నారు. డీఎస్పీలను రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయవచ్చన్న నిబంధన కూడా ఉండడంతో జూనియర్లు బాసులుగా మారడం పక్కా అని ఆందోళన చెందుతున్నారు వరంగల్ పోలీసు అధికారులు.

గతంలో హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండగా అక్కడి అవసరాలను బట్టి చకచకా ప్రమోషన్లు అందుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ అయిన తరువాత పదోన్నతులు మరింత వేగం పుంజుకున్నాయి. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రానున్న కాలంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ప్రమోషన్లలో అన్యాయానికి గురి కావల్సి వస్తుందన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవలని అంటున్నారు. ఇలాంటి అసమానతలు జరగకుండా ఉండాలంటే తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో స్టేట్ ను ఒక యూనిట్ గా చేయడం, బ్యాచ్ వైజ్ ప్రమోషన్లు కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. ప్రెసెడెన్షియల్ రూల్ తీసుకొస్తే శాశ్వత పరిష్కారం లభించినట్టు అవుతుంది.

Next Story

Most Viewed