పట్టుకున్న వాహనాలు వాపస్: ఎస్పీ రాజు

by  |

దిశ, ఆదిలాబాద్ :

లాక్‌డౌన్ సమయంలో నిర్మల్ జిల్లా పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులకు తిరిగి అందజేసే ప్రక్రియను శనివారం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులకు తిరిగి అందజేసే ప్రక్రియను ఎస్పీ సమీక్షించారు. వాహనానికి సంబంధించిన ధ్రువ ప్రతాలను అందజేసిన వాహన యజమానులకు తాళాలను అందజేయాలన్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన తేదినాటి నుండి నిర్మల్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 1,222 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో 1,059 ద్విచక్ర వాహనాలు, 126 ఆటోలు, 30 కార్లు, 07 ట్రాక్టర్లు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 352 ఎఫ్.ఐ.ఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర డీజీపీ మార్గదర్శకాలను అనుసరించి రహదారులపై తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న వాహనాలపై ఐ.పి.సి 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలను పొందేందుకు యజమానులు ఆధార్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో పాటు, న్యాయస్థానం ఆదేశాల మేరకు వాహనాలను ప్రవేశ పెట్టి, వాహన యజమాని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అందజేస్తామని తెలిపారు.



Next Story