కోట్లు కుమ్మరిస్తున్న ఆ ప్రాజెక్టు ‘మట్టి’.. ‘క్యాష్’ చేసుకుంటున్న టీఆర్ఎస్ లీడర్

by  |
కోట్లు కుమ్మరిస్తున్న ఆ ప్రాజెక్టు ‘మట్టి’.. ‘క్యాష్’ చేసుకుంటున్న టీఆర్ఎస్ లీడర్
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయతీ మట్టి దందాకు కేరాఫ్‌గా మారింది. ఓ వైపు సీతారామ ప్రాజెక్టు పనులు మరోవైపు రైల్వే పనులు జరుగుతుండటంతో అక్రమార్కులకు అదృష్టంగా మారింది. సీతారామ ప్రాజెక్టు, రైల్వే పనులకు సంబంధించిన వాహనాలు ఇక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్ల సాయంతో ప్రాజెక్టు పనులకు సంబంధించిన వాహనాలుగా కవరింగ్ చేస్తూ అక్రమంగా మట్టి తరలించుకుపోతున్నారు. గత రెండు నెలలుగా ‘దిశ’ దినపత్రికలో గుంపెన పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి దందాపై ఎన్నో కథనాలు ప్రచురితమైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

సీతారామ ప్రాజెక్ట్‌కు చెందిన మట్టిని అర్ధరాత్రి పూట రైల్వే కాంట్రాక్టర్ తరలించికు పోతున్నాడని, గుంపెన పంచాయతీలోని కట్టుగూడెం గ్రామం శివారు నుంచి చండ్రుగొండ మండల కేంద్రంనకు మట్టి తరలిపోతుందని అనేక కోణాల్లో వార్తలు ప్రచురితమైనా అధికారులు మాత్రం దీనిపై నిఘా పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నపురెడ్డిపల్లి మండల రెవెన్యూకు సంబంధించిన మట్టిని పక్క మండలమైన చంద్రుగొండకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన సొంత జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో హైవే పక్కన గల మట్టి తరలిస్తుంటే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయల సొమ్ము ప్రభుత్వ ఖజానా చేరకుండా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్టు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఓ మీడియా చానెల్లో పనిచేస్తున్న వ్యక్తి అధికార పార్టీకి తొత్తుగా మారి దిశ కథనం అవాస్తం అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది.


Next Story

Most Viewed