సీడ్ ఆర్గనైజర్ల నయా దందా.. రైతులను ముంచేందుకే మక్కలు ఇస్తున్నారా..?

by  |
సీడ్ ఆర్గనైజర్ల నయా దందా.. రైతులను ముంచేందుకే మక్కలు ఇస్తున్నారా..?
X

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట : నిబంధనలకు విరుద్ధంగా, రైతులకు ఎటువంటి అగ్రిమెంట్లు ఇవ్వకుండానే దర్జాగా మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందిస్తున్నారు సీడ్ ఆర్గనైజర్లు. దిగుబడి రాని పక్షంలో తమకు సంబంధం లేదనే రీతిలో వీరి వ్యవహారశైలి ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొక్కజొన్న వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ రైతులు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. అదే అదునుగా భావించిన కొంతమంది ఆర్గనైజర్లు నకిలీ విత్తనాలను రైతులకు అందించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి సాయం డబ్బులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ, రైతు శ్రమను దోచుకుంటున్నారు. పాత విత్తనమనే పేరు చెప్పి, ట్రైల్ వెరైటీ వంగడం విత్తనాలు రైతులకు అందిస్తూ వారిని మోసం చేస్తున్నారు.

పాపం పుణ్యం ఎరుగని రైతులు ఆర్గనైజర్ చెప్పిన మాటలు వింటూ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్లు వలన ప్రతియేటా ఎక్కడో ఒకచోట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరానికి 5 నుంచి 6 టన్నుల వరకు యిల్డింగ్ వస్తుందని, టన్ను మొక్కజొన్న 16 వేల నుంచి 20 వేలు వరకు ఇస్తామని ఆశ చూపి రైతులను నట్టేటా ముంచుతున్నారు. ఏదో ఒక నాణ్యత పరమైన కంపెనీ పేరు చెప్పి కంపెనీకి రైతులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. రైతులకు మేలు చేసేది అయితే ఎవరైనా ప్రోత్సహించవచ్చు, కానీ వీరు రైతుల కష్టాన్ని దోచుకుంటూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇందులో ఉన్న అసలైన మతలబు ఏంటంటే ఒకవేళ ఆర్గనైజర్ ఇచ్చిన ఏరియాలో ఆ సంవత్సరం అంతగా పంట దిగుబడి రాకపోతే ఆర్గనైజర్ కంటికి కూడా కనిపించడనేది వాస్తవం.

అగ్రిమెంట్లు లేకుండానే విత్తనాల పంపిణీ

ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది ఆర్గనైజర్లు తాము ఇచ్చిన విత్తనం ఇన్ని టన్నులు వస్తుందని చెప్పి రైతుతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అంటే ఒకవేళ ఆర్గనైజర్ చెప్పిన దానికంటే తక్కువ వస్తే ఆర్గనైజర్ అగ్రిమెంట్ పరంగా రైతుకు డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ అలాంటిది ఏమీ చేయకుండా మీరు మరో విత్తనం వేయడానికి వీలు లేదు. మీ పక్కన ఏదైతే విత్తనం పండిస్తారో అదే విత్తనాన్ని మీరు కూడా సాగు చేయాలని చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ఆర్గనైజర్లపై దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed