ఈగను కూడా రానివ్వం.. సీఎం సార్ ఇంటి చుట్టూ ఇనుప కంచె

by  |
Security enhanced at Pragathi Bhavan in Hyderabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ఇప్పుడు బారికేడ్ల ప్రాంగణంగా మారుతున్నది. ఇంతకాలం భవన్ చుట్టూ మాత్రమే ఎత్తయిన బారికేడ్లు, వాటిమీద సోలార్ ఫెన్సింగ్ ఉండేది. భద్రతా కారణాల రీత్యా నిత్యం వందలాది మంది పోలీసుల పహరా అవసరమే కావచ్చు. కానీ ఇప్పుడు ఆ భద్రత మరింతగా పెరిగింది. రోడ్డుమీద డివైడర్ కూడా ఇప్పుడు భారీ ఫెన్సింగ్‌లాగా మారుతున్నది. సుమారు 350 మీటర్ల పొడవునా ఆరడుగుల ఎత్తులో భారీ స్థాయి బారికేడ్లతో ఫెన్సింగ్ వాల్ తయారవుతున్నది. ప్రగతి భవన్ ముందు నిరసనలు, ధర్నాలను నివారించేందుకు పోలీసులు ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. సామాన్యులెవరూ ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కాని తీరులో పటిష్ట పోలీసు, ఆంక్షల వలయం తయారవుతున్నది.

Pragathi Bhavan2

వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు, యువత, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, అన్యాయానికి గురైనవారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రగతి భవన్ ముందు నిరసన, ధర్నా చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ధర్నాలకు తావులేని పాలన అందిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినా ధర్నాలు తప్పలేదు. నిత్యం ధర్నా చౌక్‌లో నిరసనలు చోటుచేసుకుంటుండడంతో అది కూడా నిషిద్ధ ప్రాంతమైంది. ధర్నా చౌక్‌నే ఎత్తివేసింది ప్రభుత్వం. కోర్టుకు వెళ్ళి నిరసనకారులు దాన్ని సాధించుకున్నారు.

Pragathi Bhavan3

ఇటీవలి కాలంలో ప్రగతి భవన్ కూడా ధర్నాచౌక్ తరహాలో మారిపోతున్నది. గతంలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ ముందు ధర్నా చేశారు. లోపలికి చొచ్చుకెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే రేవంత్‌ను అడ్డుకోడానికి అనేక చోట్ల పోలీసులు మాటుగాసినా ప్రగతి భవన్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు మీద నుంచి రెండడుగుల ఎత్తులో ఉన్న డివైడర్ మీద నుంచి దూకి గేటు దగ్గరకు చేరుకున్నారు. దీన్ని ఫాలో అయిన ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ లాంటి సంఘాల విద్యార్థులు, కార్యకర్తలు సైతం ప్రగతి భవన్‌కు ఎదురుగా ఉన్న అవతలివైపు రోడ్డు మీద కాపుగాసి అనుకున్న సమయానికి సరిగ్గా డివైడర్ దూకి ప్రధాన గేటు దగ్గరకు వస్తున్నారు. దీంతో ఈ డివైడరే పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నది. ప్రగతి భవన్ దగ్గర ధర్నాలు ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నవి.

Pragathi Bhavan4

ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డివైడర్ స్థానంలో రెండంచెల బారికేడ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రగతి భవన్‌కు రెండు వైపులా ఉన్న ఫ్లై ఓవర్‌ల వరకూ ఈ బారికేడ్లు ఉనికిలోకి రానున్నాయి. అవతలివైపు ఉన్న రోడ్డు మీద నుంచి ప్రగతి భవన్ వైపు రావడానికి ఆస్కారం లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరసనలను, ధర్నాలను నివారించడం కోసమే ఈ బారికేడ్ల నిర్మాణం జరుగుతున్నదనేది బహిరంగ రహస్యం. గతంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సామాన్యులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ప్రగతి భవన్ (అప్పుడు ఈ పేరు లేదు)కు వచ్చి మెమొరాండంలు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు అది నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది.

Next Story

Most Viewed