కేసీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా ?

by  |
కేసీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. కాన్వాయ్‌కు ఎదురుగా ఇద్దరు యువకులు స్కూటీపై రాంగ్ రూట్‌లో వెళ్ళారు. సీఎం రాక సందర్భంగా రోడ్లపై సాధారణ ట్రాఫిక్‌‌ను పోలీసులు ముందుగానే ఆపివేస్తారు. పదుల సంఖ్యలో రోడ్లమీద పోలీసుల పహరా ఉంటుంది. ఇన్ని ఏర్పాట్లు ఉన్నా ఇద్దరు యువకులు స్కూటీపై సీఎం కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్ళడం అనేక అనుమానాలకు దారితీసింది. విధిలేని పరిస్థితుల్లో ఆ స్కూటీని తప్పించడానికి మొత్తం కాన్వాయ్ స్లో కావాల్సి వచ్చింది.

టాంక్‌బండ్ రోడ్డు మీద నుంచి సచివాలయం వెళ్ళే మార్గంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో పోలీసులకు చెమటలు పట్టాయి. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆ యువకులు ఎవరు, అప్పటివరకూ ఎక్కడున్నారు, ఏ రోడ్డు మీద నుంచి వచ్చారు, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఎందుకు గమనించి ఆపలేకపోయారు తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. యువకుల ఆకతాయి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సంగతి ఎలా ఉన్నా పటిష్ట బందోబస్తు ఉన్నా ఎలా రోడ్డుమీదకు రాగలిగారన్నది కీలకంగా మారింది. అప్పటికీ ఇద్దరు పోలీసులు ఆ స్కూటీని ఆపే ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకుని కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్ళగలిగారు.

బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు భయం పట్టుకున్నది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సీరియస్ యాక్షన్‌ ఉంటుందోనని ఆందోళనపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తులో తలెత్తిన ఈ వైఫల్యానికి ఎవరు ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో ఒకటి రెండు రోజుల్లో తేలనున్నది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు దీన్ని ధృవీకరించలేదు.

ఫ్లాష్.. ఫ్లాష్.. మరో వివాదంలో ఎర్రబెల్లి.. మహిళా ఎంపీపీని పోలీసులతో..



Next Story

Most Viewed