ఇవాళ్టి నుంచి మల్హర్‌లో 144 సెక్షన్

by  |
ఇవాళ్టి నుంచి మల్హర్‌లో 144 సెక్షన్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని నియోజకవర్గంలో దళితల మరణాల చుట్టే రాజకీయాలు జరుగుతన్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరి మరణాలను ఆసరాగా చేసుకుని పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో దళితుడు మరణించాడంటే ఆరోపణల పర్వం కొనసాగుతోంది. వాస్తవం ఏంటి..? ఆ కుటుంబాల పరిస్థితి ఏమైంది అన్న విషయాన్ని రెండు పార్టీలు కూడా విస్మరిస్తున్నారు.

మంథని మధుకర్ కేసు..
2017లో మంథని సమీపంలోని ఖానాపూర్‌కు చెందిన మంథని మధుకర్ మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయిది. ప్రేమ వ్యవహారం కారణంగానే మధుకర్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అండదండలతో హత్య జరిగిందని విమర్శలు రావడంతో ఆయన కూడా సత్యగ్రహ దీక్ష చేసి, తనకు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మంథని మధూకర్ మర్మాంగాలను కోసి మరీ చంపేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మంథని మధుకర్ ప్రేమించిన యువతి పుట్ట మధు సామాజిక వర్గానికి చెందినదని, మధూ అండదండలతోనే ఈ ఘటన జరిగింది అన్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు హై కోర్టు ఆదేశాలతో ప్రొఫెసర్లు ఆయన శవాన్ని రీ పోస్టుమార్టం చేసి నివేదికను సీల్డ్ కవర్ లో హై కోర్టుకు సమర్పించడంతో ఈ విషయాన్ని పక్కనపడేశారు ఇరు పార్టీల నాయకులు.

రంగయ్య హత్యోదంతం
రామగిరి మండలం పుట్టపాకకు చెందిన రంగయ్య మే 25న మంథని పోలీసుల కస్టడీలో ఉండగా బాత్రూంలో శవమై కనిపించాడు. ఆయన ఉరి వేసుకున్నాడని పోలీసులు వెల్లడించగా ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రంగయ్య మరణంలోనూ అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ప్రకటనల వార్ కొనసాగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ లు కూడా మంథనిలో పర్యటించి ఆరోపణలు చేశారు. మరో వైపున పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కూడా పలుమార్లు మీడియా ముందు ఈ విషయం గురించి మాట్లాడారు. చివరకు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ క్షేత్ర స్థాయి పర్యటన చేసి నివేదిక హై కోర్టుకు సమర్పించారు.

తాజాగా మల్హర్ మండలంలో..
తాజాగా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో ని రేవెల్లి రాజబాబును అదే గ్రామానికి చెందిన దేవసాని శ్రీనివాస్, ఆయన బావమరదులు కొట్టి చంపారని ఆరోపణలు వస్తున్నాయి. దళితుడైన రాజబాబును కొట్టి చంపారని బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ తరువాత కాంగ్రెస్ నాయ కులు టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ టీఆర్ఎస్ వార్డు మెం బర్ కావడంతో ఈ నెల 26న చలో మల్లారం అంటూ దళిత సంఘాలు, కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇదే రోజున నిజనిర్దారణ కోసం టీఆర్ఎస్ కూడా చలో మల్లారం అంటూ పిలుపునిచ్చింది. పోలీసులు జోక్యం చేసుకుని శనివారం నుండి సోమవారం వరకు మల్హర్ మండలంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ప్రకటించారు. మల్లారం గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని స్ఫష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై విపత్తు నివారణ చట్టాన్ని ఉపయోగిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.



Next Story

Most Viewed