మీకు సగం.. మాకు సగం!

by  |
మీకు సగం.. మాకు సగం!
X

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికారంలోని బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. జేడీయూ పెద్దమొత్తంలోనే సీట్లను బీజేపీకి వదిలిపెట్టారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు 50:50 చొప్పున పంచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ 119, జేడీయూ 119 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఐదు సీట్లను హిందుస్తానీ అవామ్ మోర్చాకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 53 చట్టసభ్యులు, జేడీయూకు 71 మంది ఎమ్మెల్యేలున్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 141 స్థానాల్లో, బీజేపీ 102 స్థానాల్లో పోటీ చేసింది.

నితీష్‌కు ఎసరు?

ఎల్‌జేపీ మాత్రం జేడీయూతో కలిసి బరిలోకి దిగడానికి ససేమిరా అంటోంది. బీజేపీతో దోస్తీ కొనసాగిస్తూనే జేడీయూకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుంది. జేడీయూతో భావజాలపరమైన విభేదాలతో పొత్తు కూడటం లేదని ఎల్‌జేపీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ ఖాలిక్ తెలిపారు. మొత్తం 243 స్థానాల్లో తమ పార్టీ పోటీచేయనున్నట్టు వెల్లడించారు. అయితే, బీజేపీతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలాగే, ఇక్కడా బీజేపీ నేతృత్వంలో పాలన సాగాలని ఆశిస్తున్నట్టు వివరించారు.

ఎల్‌జేపీకి ఆరు నుంచి 12 శాతం ఓట్లు పడే అవకాశముంది. దీంతో జేడీయూపై గట్టి దెబ్బ పడే ప్రమాదముందని సమాచారం. కరోనా నిలువరించే విధానం, ఇతర సమస్యలపై ఎల్‌జేపీ, జేడీయూల మధ్య మొదలైన ఘర్షణ ముగియకపోవడంతో పొత్తులో పొసగలేదని తెలిసింది. దీన్నే బీజేపీ పరోక్షంగా వినియోగించుకుని సీఎం నితీష్ కుమార్ స్థానానికి ఎసరు పెట్టే వ్యూహాన్ని పన్నిందన్న అనుమానాలు రాజకీయ శ్రేణుల్లో గుప్పుమన్నాయి.



Next Story

Most Viewed