సీరియల్ కిల్లర్ విడుదల కోసం సైంటిస్టుల తపన

144

దిశ, వెబ్‌డెస్క్ : సీరియల్ కిల్లర్లు అంటేనే ఒళ్లు వణుకుతుంది. వారి వివరాలు, హత్య తాలూకు విధానాలు తెలిస్తే తల తిరుగుతుంది. సైకో సీరియల్ కిల్లర్లు వేరే లెవెల్. అలాంటి వారు దోషులుగా తేలి శిక్ష పడినప్పుడు కాస్త ఉపశమనంగా ఫీల్ అవుతాం. కానీ, ఆస్ట్రేలియాలో కొందరు శాస్త్రవేత్తలు, నిపుణులు ఏకంగా సీరియల్ కిల్లర్ విడుదల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆషామాషీ శాస్త్రవేత్తలు కాదు.. జన్యు పరమైన శాస్త్రవిషయాల్లో అంతర్జాతీయంగా పేర్గాంచినవారున్నారు. ఇంత పేరుండి ఒక సీరియల్ కిల్లర్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేయడమేంటి? అంటే వారు దానికి ఒక లాజిక్ చెబుతున్నారు. అదేంటో పరిశీలిద్దామా..

కారణమిదే..

1990 నుంచి 1999 కాలంలో తన నలుగురు సంతానాన్ని హత్య చేసిన నేరం కింద తల్లి కాథలీన్ ఫోల్‌బిగ్ 2003 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ ‘బేబీ కిల్లర్’ కోసం కనీసం 90 మంది ప్రముఖ సైంటిస్టులు సంతకాలు చేస్తూ ఓ పిటిషన్‌ను న్యూ సౌత్‌వేల్స్ గవర్నర్‌కు అందజేశారు. ఆ నలుగురు చిన్నారులూ అరుదైన జన్యు లోపాలు కలిగి ఉన్నారని, ఆ కారణంగానే వారు మరణించి ఉండవచ్చని వివరిస్తున్నారు. కాథలీన్ పిల్లలు కాలెబ్, ప్యాట్రిక్‌లు బీఎన్ఎస్ జీన్‌కు చెందిన అరుదైన మ్యుటేషన్ కలిగి ఉన్నారని, ఈ వేరియంట్ల గురించి ఎలుకలపై కొన్ని ప్రయోగాలు జరిగాయని, నాడీవ్యవస్థలో ఫిట్స్ ఏర్పడటానికి ఈ వేరియంట్లు పురికొల్పే అవకాశమున్నట్టు తేలిందని వివరించారు. ఈ ఫిట్స్‌తో ప్రాణాలు పోయే ఆస్కారముందని తెలిపారు.

అదృశ్య శక్తులు నా పిల్లలను దూరం చేశాయి..

పిల్లల హత్యపై భౌతిక ఆధారాలేమీ లేవని, ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఈ హత్యలు చేసి ఉండవచ్చని ఈ కేసు గురించి తెలిసినవారు చెప్పారు. కేసు గురించి ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ డైరీ ఎంట్రీలను ప్రస్తావించారు. కాథలీన్ తన డైరీలో రాసుకున్న కొన్ని వాక్యాలు ఇలా ఉన్నాయి. ‘ఈ సారి నేను ఇతరులను సహాయమడుగుతా. నాకు నేనుగా ఏ పనీ చేయబోను. నాకు తెలుసు దీనికంతటికీ నా ఒత్తిడే కారణం. ఒత్తిడిలో నేను దారుణమైన పనులు చేస్తున్నాను’ అని రాసి ఉంది. మరో వాక్యం ‘సారా అల్లరి చేయకుండా మౌనంగా ఉండాలని భావించా. ఒక రోజు ఆమె అదే పని చేసింది’ అని ఉంది. విచారణలో కాథలీన్ ఎలాంటి ఉద్వేగం లేకుండా ఉండటంతో ఆమెపై అనుమానాలు రేగాయి. ఆ డైరీ ఎంట్రీల గురించి కాథలీన్‌ను ఆరా తీస్తే ‘కొన్ని అదృశ్య శక్తులు నా పిల్లలను నాకు దూరం చేశాయని నమ్ముతున్నాను. సహజంగా కనిపించే కారణాలకే నా పిల్లలు మరణిస్తుండగా నిశ్చేష్టురాలిగా, నిస్సహాయంగా మిగిలిపోయిన విషాదం నుంచే ఒక తల్లిగా బాధపడుతూ ఆ వాక్యాలు రాశాను’ అని వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..