విద్యావాలంటరీలు ఉన్నట్టా లేనట్టా..?

by  |
part time instructors
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్‌తో మూతపడిన పాఠశాలలు ఎట్టేకేలకు నేడు ప్రారంభమవుతున్నాయి. కానీ, నేటివరకూ ప్రభుత్వం విద్యావాలంటరీల నియామకాలు చేపట్టలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,428 మంది విద్యావాలంటరీ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వీరితో పాటు 12,271 మంది పార్ట్ టైం ఇన్స్రక్టర్స్ కూడా విధుల్లోకి తీసుకోకపోవడంతో పాఠశాలలో సిబ్బంది కొరత వెంటాడనుంది. రాష్ట్రంలో 400 పాఠశాలలో ఏకోపాధ్యాయులుగా విద్యావాలంటరీలు విధులు నిర్వహించారు. 2020 మార్చి నెల నుంచి ఉపాధిని కోల్పోయిన విద్యావాలంటరీలు, పార్ట్ టైం ఇన్స్రక్టర్స్ ప్రభుత్వ కరోనా సాయానికి కూడా నోచుకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లో, టీచర్ల కొరత ఉన్న పాఠశాలలో ప్రభుత్వం విద్యావాలంటరీల నియామకాలు చేపట్టి విద్యార్థులకు విద్యను అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రతీ ఏడాది నోటిఫికేషన్ విడుదల చేయడం, మళ్లీ గతేడాది విధులు నిర్వహించిన విద్యావాలంటరీలనే తిరిగి నియామకాలు చేపడుతూ వస్తోంది. కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి ప్రభుత్వం ఈ ప్రక్రియకు మంగళం పాడింది. ఈ ఏడాది విద్యావాలంటరీల నియామకం చేపట్టేందుకు ఫిబ్రవరి 15న డీఎస్సీ ప్రోసిడింగ్ నెంబర్ 40 ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు. విద్యావాలంటరీలు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కష్టతరంగా మారనుంది. ప్రభుత్వం నియమకాలు చేపట్టకపోవడంతో 11,428 మంది విద్యావాలంటరీలు, 12,271 మంది పార్ట్ టైం ఇన్స్రక్టర్స్ ఉపాధిలేక రోడ్డున పాడాల్సిన పరిస్థితి నెలకొంది.

2020 మార్చి నుంచి ఉపాధి కోల్పోయిన విద్యావాలంటరీలు :

కరోనా ఫస్ట్ వేవ్‌లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను మూసివేశారు. దీంతో 2020 మార్చి 18 నుంచి విద్యావాలంటరీలు ఉపాధి కోల్పోయారు. 2018-19లో హైకోర్ట్ తీర్పు ప్రకారం పూర్తి స్థాయిలో టీచర్లను నియామకం జరిగేంతవరకు విద్యావాలంటరీలను రివ్యూవల్ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి నియమకాలు చేపట్టలేదు. 11 జిల్లాలలోని విద్యావాలంటరీలకు ప్రభుత్వం 3నెలల జీతాలు కూడా చెల్లించకుండా వారిని రోడ్డున పడేసింది. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు అందించిన ఆర్థిక సాయం, ఉచిత బియ్యాన్ని కూడా విద్యావాలంటరీలకు, పార్ట్ టైం ఇన్స్రక్టర్స్ అందించకుండా నిర్లక్ష్యానికి గురిచేశారు.

రాష్ట్రలో 400 వరకు విద్యావాలంటరీలతో నడిచిన పాఠశాలలు :

రాష్ట్రంలో కేవలం విద్యావాలంటరీలతో నడిచిన పాఠశాలలు 400 వరకు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో, తండాల్లో చాలా వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యావాలంటరీలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈ ఏడాది జులై నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరవుతున్న క్రమంలో విద్యావాలంటరీలు విధులు నిర్వహించిన పాఠశాలలకు సిబ్బందిని ప్రభుత్వం అడ్జెస్ట్ చేసింది. రేషనలైజేషన్ ప్రక్రియ అనంతరం టీచర్ల సర్దుబాటు జరిగితే తమ ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అని విద్యావాలంటరీలు, పార్ట్ టైం ఇన్స్రక్టర్స్‌లు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కల్పించాలి : పచ్చిపాల రవీందర్, విద్యావాలంటీల కార్యదర్శి నాగర్ కర్నూల్ జిల్లా

ఏడాదిన్నరగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేవలం ఉపాధ్యాయ వృత్తిని మాత్రమే నమ్ముకున్న నాలాంటి వారందరూ రోడ్డున పడ్డారు. ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి కూడా మేము నోచుకోలేదు. మా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి : శివానంద్, విద్యావాలంటరీల రాష్ట్ర అధ్యక్షుడు

2018-19లో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం విద్యావాలంటరీలను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. 11 జిల్లాల విద్యావాలంటరీలకు పెండింగ్‌లో ఉన్న 3 నెలల వేతనాలు చెల్లించాలి. 400 పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం కష్ట సమయంలో రోడ్డున పడేసింది. మారుమూల ప్రాంతాల్లోని, తాండాల్లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన విద్యను అందించేందుకు విద్యావాలంటరీలను విధుల్లోకి తీసుకోవాలి.



Next Story

Most Viewed