ఐదు పాజిటివ్ కేసులొస్తే స్కూల్ క్లోజ్..!

by  |
schools opening
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకే రోజు 5 కరోనా కేసులు తేలిన పాఠశాలలను మూసివేయాల్సిందేనని ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. క్వారంటైన్ సమయం పూర్తి అయ్యే వరకు వాటిలో ఎట్టి పరిస్థితుల్లో క్లాస్‌లు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. లేదంటే వైరస్ వ్యాప్తి భారీగా పెరిగే ప్రమాదం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. అంతేగాక పాజిటివ్ తేలిన పాఠశాలలో వెంటనే శానిటేషన్‌తో పాటు ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు నిర్వహించాలన్నది. ఆ మేరకు ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు.

అత్యధికంగా కేసులు నమోదవుతున్న పాఠశాలలు తమను సంప్రదిస్తే కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తామని వైద్యశాఖ వివరించింది. అదే విధంగా హాస్టళ్లు, రెసిడెన్షియల్ సంస్థలలోని విద్యార్ధులకు లక్షణాలు తేలితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యత ఆయా స్కూళ్ల వార్డెన్‌లు, ప్రిన్సిపల్స్ దేనని హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్‌లందరికీ టెస్టులు నిర్వహించాలన్నారు. మరోవైపు ఈ నెల 30 వరకు అన్ని స్కూళ్లను క్లీన్ చేయించాలని వైద్యశాఖ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను కోరింది. దీంతో పాటు ప్రతి పాఠశాల ప్రవేశంలో థర్మల్ స్ర్కీనింగ్, శానిటేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అన్ని స్కూళ్లకు ముందస్తు జాగ్రత్తలు వివరించింది.

వ్యాక్సిన్, మాస్కు మస్ట్…

స్కూళ్లు ప్రారంభమైన తర్వాత టీకా తీసుకున్నోళ్లను మాత్రమే అనుమతించాలని వైద్యశాఖ ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక పాఠశాలలోనూ మాస్కును మస్ట్‌గా ధరించాలనే నిబంధన పెట్టాలన్నది. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేగాక పాఠశాలలకు వచ్చే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు పేరెంట్లకూ టీకాను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయాలన్నది. లేదంటే పెద్దల ద్వారా పిల్లల్లో వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూల్స్‌కూ ఈ నిబంధనలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నది.

ఇప్పటికే వైద్యశాఖ ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు టీకాలు ఇచ్చామని తెలిపింది. ఇప్పటి వరకు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారు వెంటనే తమను సంప్రదించాలని హెల్త్ ఆఫీసర్లు పేర్కొన్నారు. స్కూల్స్ తెరిచే లోపు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోగలిగితే, కొంత వరకు రక్షణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రతి రెండు వారాలకోసారి…

పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, ఇతర సిబ్బంది ప్రతి రెండు వారాలకోసారి కరోనా టెస్టులు చేసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. దీంతో పాటు లక్షణాలున్న చిన్నారులందరికీ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలన్నది. ఈ మేరకు అవసరమైన సౌకర్యాలను వైద్యశాఖ సమకూరుస్తుందని స్పష్టం చేసింది. జిల్లా వైద్యాధికారికి స్కూళ్ల వివరాలు ఇస్తే ప్రత్యేక టీంల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారన్నది. స్కూల్స్‌కు వచ్చే చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. కావున పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తీసుకోవద్దని వివరించింది.



Next Story