రికార్డు స్థాయిలో SBI త్రైమాసిక ఫలితాలు..

by  |
sbi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2021-22 తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి రికార్డు ఫలితాలను వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభం ఏకంగా 55.2 శాతం పెరిగి రూ. 6,504 కోట్లుగా ప్రకటించింది. గతేడాది బ్యాంకు లాభాలు రూ. 4,189.4 కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 3.7 శాతం పెరిగి రూ. 27,638 కోట్లకు చేరుకోగా, వడ్డీయేతర ఆదాయం 24.3 శాతం వృద్ధితో రూ. 11,803 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 5.06 శాతం పెరిగి రూ. 18,061 కోట్ల నుంచి రూ. 18,975 కోట్లుగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఈ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం డిపాజిట్లు 8.82 శాతం పెరగ్గా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 11.75 శాతం, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు 10.55 శాతం వృద్ధి నమోదైనట్టు బ్యాంకు వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను అధిగమించి, సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకు అన్ని విభాగాల్లోను మెరుగైన పనితీరును కనబర్చింది. నిరంతరం పరిస్థితులను అంచనా వేస్తున్నామని’ బ్యాంకు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది.

Next Story