తగ్గిన ఎస్‌బీఐ మార్కెట్ విలువ!

by  |
తగ్గిన ఎస్‌బీఐ మార్కెట్ విలువ!
X

ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాప్ 10 విలువైన కంపెనీల జాబితా నుంచి దిగజారింది. ఎస్‌బీఐ స్థానంలో బజాజ్ ఫినాన్స్ 10వ స్థానానికి చేరుకుంది. సోమవారం ఉదయం నాటికి ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 2.85 లక్షల కోట్లుగా ఉంది. బజాజ్ ఫినాన్స్ రూ. 2.87 లక్షల కోట్లతో 10వ స్థానానికి ఎగబాకింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎస్‌బీఐ షేర్ ధర సుమారు 7 శాతం తగ్గింది. బ్యాంక్ నిరర్ధక ఆస్తులు పెరగడంపై మదుపర్లలో ఆందోళన అధికమవుతుండటంతో ఎస్‌బీఐ షేర్ ధర మరింత క్షీణించింది.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఫినాన్స్ షేర్ ధర 60 శాతం వరకూ పెరిగింది. త్రైమాసిక ఫలితాల్లో, బజాజ్ ఫినాన్స్ ప్రస్తుత త్రైమాసిక నికర లాభం 52 శాతం పెరిగింది. క్రితం త్రైమాసికంలో రూ. 1,060 కోట్ల లాభంతో పోలిస్తే ఇది అధికం. ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ.7,026 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో రూ. 4,992 కోట్లు. నికర వడ్డీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 42 శాతం పెరిగి రూ. 4,537 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో రూ. 3,206 కోట్లుగా ఉండేది. వడ్డీ ఆదాయం గత త్రైమాసికంలో 39 శాతం పెరిగి రూ. 6,105 కోట్లకు చేరుకుంది. 2018-19 ఇదే త్రైమాసికంలో రూ .4,387 కోట్లుగా ఉండేది.

ఎస్‌బీఐ 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికం స్వతంత్ర లాభంలో 41.17 శాతం వృద్ధితో రూ. 5,583.36 కోట్లను సాధించింది. అంతకుముందు ఏడాది ఇది రూ. 3,955 కోట్లు. ఇక, ఋణదాతల నికర వడ్డీ ఆదాయం ప్రస్తుత త్రైమాసికంలో రూ. 22.42 శాతం పెరిగి రూ. 27,779 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 22,691 కోట్లు.

ఎస్‌బీఐ టాప్ 10 స్థానాల నుంచి తప్పుకోవడంతో రూ. 2.87 లక్షల కోట్లతో బజాజ్ ఫినాన్స్ పదో స్థానంలోకి వచ్చింది. అత్యధికంగా రూ. 9.42 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్టీస్ తొలిస్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ రూ. 8.19 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 6.67 లక్షల కోట్లు, హిందూస్తాన్ యూనిలీవర్ రూ.4.88 లక్షల కోట్లు, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫినాన్స్ కార్ప్ రూ. 4.15 లక్షల కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ రూ.3.33 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 3.31 లక్షల కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 3.21 లక్షల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ. 3.8 లక్షల కోట్లతో వరుస స్థానాల్లో ఉన్నాయి.

Next Story