గృహ రుణాలకు రాయితీ ప్రకటించిన ఎస్‌బీఐ!

by  |
గృహ రుణాలకు రాయితీ ప్రకటించిన ఎస్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వస్తున్న క్రమంలో ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారికి దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభవార్త అందించింది. గృహ రుణాల వడ్డీ రేట్లపై 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజుపై వంద శాతం మినహాయింపును ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ రాయితీలను పొందాలనుకునే వినియోగదారుల సిబిల్ స్కోర్‌ను బట్టి వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ. 30 లక్షల వరకు రుణాలకు 6.80 శాతంతో వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. రూ. 30 లక్షలకు మించిన రుణాలకు 6.95 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా మహిళా కొనుగోలుదారులకు 5 బేసిస్ పాయంట్లను రాయితీగా ఇవ్వనున్నట్టు, అలాగే దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో రూ. 5 కోట్ల వరకు గృహ రుణాలపై ఇలాంటి రాయితీలనే అందించనున్నట్టు పేర్కొంది.

యోనో యాప్ నుంచి గృహ రుణాలకు అప్లై చేసిన వారికి అదనంగా ఇంకో 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఉంటుందని తెలిపింది. ‘గృహ రుణాలపై ఎస్‌బీఐ అతి తక్కువ వడ్డీతో గృహాల కొనుగోలుదారులు ఇంటిని కొనే ప్రక్రియను సులభతరం చేస్తుందని నమ్ముతున్నామని’ ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి వెల్లడించారు.



Next Story

Most Viewed