స్మార్ట్ సిటీ పనుల్లో అంతా అవినీతే.. సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు

by  |
స్మార్ట్ సిటీ పనుల్లో అంతా అవినీతే.. సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రతిష్ఠాత్మకమైన స్మార్ట్ సిటీ పనుల్లో అంతా అవినీతి కొనసాగుతోందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పాలకవర్గం పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పనుల నిర్మాణంలో ఏమాత్రం రాజీ లేకుండా ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని విమర్శించారు. లాక్ డౌన్‌ను ఆసరాగా చేసుకొని స్మార్ట్ సిటీ పనుల్లో అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రూ. 10 కోట్ల విలువైన ఇసుకను మండలంలో చేగుర్తి గ్రామంలోని వాగు నుంచి సరఫరా చేశారని, పనికిరాని ఇసుకను స్మార్ట్ సిటీ పనుల్లో వినియోగించడంతో, రహదారులన్నీ పగుళ్లు పట్టాయని అన్నారు.

ఇందుకు నిదర్శనమే కలెక్టరేట్ రోడ్డుతో పాటు ఆదర్శనగర్‌లో నిర్మించిన రహదారులు అని అన్నారు. చిన్నపాటి వర్షాలకు కలెక్టరేట్ రోడ్డు ధ్వంసం అవడంతో పైపూతలతో ప్యాచ్ వర్క్స్ చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. వీటిపై సంబంధిత గుత్తేదారులకు నోటీసులు జారీ చేస్తే, పైరవీలతో నోరు మూయించారని దుయ్యబట్టారు. నాణ్యతలేని పనులపై ప్రశ్నించిన మున్సిపల్ అధికారులకు బదిలీలు బహుమానంగా అందిస్తున్నారని ధ్వజ మెత్తారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నోరుమెదపకపోవటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

ఏ విజన్ లేకుండా ముందుకు సాగుతున్న బండి సంజయ్ ముందుగా తన పార్టీని కాపాడుకోవాలని, రాజ్యాంగ బద్ధంగా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోక అపహస్యం చేశాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల కోసం నిర్వహించిన క్యాంపులో ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ క్యాంపులో చేరటం సంజయ్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఓ జాతీయ పార్టీలో తాను చేరుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం మానుకోవాలని హితువు పలికారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని, స్వతంత్రంగానే ఉంటూ నగరంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అక్రమ రవాణా ద్వారా వచ్చిన 10 కోట్ల ఆదాయం ఎవరి ఖాతాలో జమ అయిందో, తేటతెల్లం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed