అధికారులతో కుమ్మక్కై.. ఇంద్రావతిని తోడేస్తున్నారు!

by  |
అధికారులతో కుమ్మక్కై.. ఇంద్రావతిని తోడేస్తున్నారు!
X

దిశ, వాజేడు : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భోపాలపట్నం బ్లాక్‌లోని తీమేడ్ సమీపంలో గల ఇంద్రావతి నది నుంచి రాష్ట్రానికి యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతున్నది. నిత్యం పదుల సంఖ్యలో లారీల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. ధనార్జన కోసం కొంత మంది ఇసుక స్మగ్లర్లు ఛత్తీస్‌గఢ్‌ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని ఇంద్రావతి నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే..

ఇసుక తరలింపునకు అనుమతులు తప్పనిసరి, కానీ రాష్ట్రం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇసుక అక్రమ రవాణా టీఎస్ ఎండి, సీజీఎండీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నదని తెలుస్తోంది. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా ఇంద్రావతి నది నుంచి పెద్ద పెద్ద మిషన్లతో ఇసుకను లారీల్లో లోడ్ చేసే విషయం అధికారులకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయలు సెస్సులు కోల్పోతున్నాయి. ఇసుకాసురులు ఇదొక అవకాశంగా తీసుకున్న అవకాశం ఉన్నంత వరకు ఇసుకను తోడేసి సొమ్ములు చేసుకుంటున్నారు. ఊసూరు బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత అనేక అక్రమాలకు వారధిగా మారింది.

కొరవడిన నిఘా..

మరోవైపు గంజాయి కూడా అక్రమంగా తరలిస్తున్నారని తెలుస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నామమాత్రంగా ఉండటంతో అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఇసుక, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed