బస్సు ఎక్కాలంటే జంకుతున్నరు.. ఎందుకంటే..?

by  |
బస్సు ఎక్కాలంటే జంకుతున్నరు.. ఎందుకంటే..?
X

కరోనా దెబ్బకు ప్రతి రంగమూ కూదేలైంది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. సుమారు 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో సంస్థ తీవ్ర నష్టాలపాలైంది. నష్టాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించి చార్జీలు పెంచింది. ఫలితంగా సంస్థ కాస్త కోలుకుంటోంది అనుకునే సమయంలో కరోనా పిడుగు పడింది. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బస్సు ఎక్కాలంటే జంకుతున్నారు. దీంతో ఆర్టీసీ తిరిగి నష్టాల పాలవుతోంది. సిబ్బంది వేతనాలు, బస్సుల నిర్వహణ కష్టంగా మారుతోంది.

దిశ‌ ప్రతినిధి, నల్లగొండ: ఆర్టీసీపై కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. అసలే సిబ్బంది సమ్మెతో భారీ నష్టాల పాలైన ఆర్టీసీ.. తాజాగా కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సేవలను పునరుద్ధరించినా.. పూర్తిస్థాయిలో బస్సులు నడవడం లేదు. ప్రజలు సైతం బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు బస్సు డిపోల పరిధిలో బస్సులో ప్రయాణించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. ఫలితంగా ప్రయాణికులు లేక బస్టాండ్‌లు వెలవెలబోతున్నాయి. గతంలో సగటున ఒక కిలో మీటర్‌కు రూ.34 రాగా, ఇప్పుడు రూ.20 మాత్రమే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. కొన్ని డిపోల్లో ఆ మాత్రం ఆదాయం కూడా లేదు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రోజు బస్సులను శానిటైజ్ చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు.

సడలింపులిచ్చినా..

సంక్రాంతి సమయంలో సిబ్బంది 55 రోజుల పాటు చేసిన సమ్మెతో ఆర్టీసీ భారీగా నష్టాలను చవిచూసింది. ఒకానొకదశలో ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ అనేది ముగిసి పోయిన శకమంటూ ప్రకటనలు చేశారు. కానీ కొన్ని పరిణామాల కారణంగా మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు ఇటు ప్రభుత్వం.. అటు అధికార యంత్రాంగం బస్సులను భారీగా తగ్గించి పలు రూట్లను ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఛార్జీలను సైతం పెంచింది. దీంతో సంస్థ కొంత గాడిన పడింది. అప్పుడప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మరోసారి కరోనా రూపంలో కష్టాలు కమ్మేశాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై కరోనా సైతం ప్రభావం పడటంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు తయారైంది సంస్థ పరిస్థితి. మిర్యాలగూడ డిపోలో మొత్తం119 బస్సులు ఉండగా, వాటిలో 42 హెయిర్ బస్సులున్నాయి. లాక్​డౌన్ ముందు రోజుకి 16 లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం రోజుకు కేవలం రూ.8లక్షలు మాత్రమే ఆదాయం వస్తుంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు బస్సు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 750 బస్సులు నిత్యం రోడ్లపై ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఇక సిబ్బంది విషయానికొస్తే.. ఈ ఏడు డిపోల పరిధిలో 2,950 మంది రెగ్యులర్ సిబ్బంది, 350 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇక ఆదాయం విషయానికొస్తే.. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డిపోల ద్వారా రోజుకు రూ.33 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఆదాయం వస్తుంది. యాదాద్రిభువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట డిపో ఒకటే ఉంది. ఈ డిపో ద్వారా ప్రభుత్వానికి నిత్యం రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి, దేవరకొండ డిపోల పరిధిలో రోజుకు రూ.60 నుంచి రూ.65 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఈ కరోనా 44 రోజుల్లో సుమారు రూ.45కోట్లకు పైనే ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది.

భారంగా మారిన నిర్వహణ..

లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చినా.. ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగడం లేదు. కొన్ని బస్సులు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. రోజుల తరబడి బస్సులు నడవకపోవడం వల్ల కండీషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో డిపోల్లోని బస్సులను నిత్యం సిబ్బందితో సర్వీసింగ్ చేయిస్తున్నారు. బస్సు బ్యాటరీలు చెక్ చేయడం.. ఇంజిన్‌ను కొద్దిసేపు రన్నింగ్‌లో ఉంచడం వంటి పనులు చేస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల జీతభత్యాలు డిపోలకు పెద్ద తలనొప్పిగా మారాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోల్లోని 755 మంది సిబ్బందికి నెలకు జీతభత్యాల కింద రూ.2కోట్లకు పైగానే ఖర్చవుతాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట డిపోలో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులకు రూ.2.5 కోట్లు వేతనాలుగా ఇవ్వాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో బస్సులు నడవకపోవడం, నడిచిన వాటికి ఆదాయం సరిగ్గా రాకపోవడం వల్ల సిబ్బంది వేతనాలు, నిర్వహణ భారంగా మారుతోంది.


Next Story

Most Viewed