సెన్సేషనల్ న్యూస్: జాతీయపార్టీలోకి RS ప్రవీణ్ కుమార్

by  |
rs-praveen-kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐపీఎస్​ మాజీ అధికారి, స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైంది. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు జాతీయ మీడియా ప్రకటించింది. ఇటీవల పలు సందర్భాల్లో బహుజనుల కోసం పోరాడుతానని ప్రవీణ్​ కుమార్​ ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్లే అంశం సస్పెన్స్‌గా మారింది. ఇటు స్వయంగా పార్టీ పెడతా అని కూడా కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.

ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని మాయావతి ఇటీవలే ప్రకటించారు. కాన్షీరాం అడుగు జాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని, త్వరలో బీఎస్పీ లో చేరతారని మాయావతి వెల్లడించినట్లు నేషనల్​ మీడియా వెల్లడించింది. జాతీయ వెబ్​సైట్లలో కూడా ఈ వార్త హల్​చల్​ చేస్తోంది. ఇటీవల ఆయన పలు పార్టీలపై ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేస్తూ వచ్చారు. అంబేద్కర్ బాటలో పయనిస్తామని, తాను హుజూరాబాద్‌లో కొంద‌రికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందంటూ ఇటీవల ట్విట్టర్​లో పేర్కొన్నారు. త‌న‌పై వస్తున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని, అంబేద్క‌ర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. త‌న‌పై కేసులు పెట్టార‌ని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. బ‌హుజ‌న, బ‌డుగు వ‌ర్గాల బాగు కోస‌మే తాను ప‌నిచేస్తాన‌ని తేల్చిచెప్పారు.

రాజీనామా తర్వాత ఉత్కంఠ

ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉండగానే ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 19న తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి ఇవ్వగా… ఆ మరునాడే ఆమోదించారు. దీంతో ఆయన టీఆర్​ఎస్​ వైపు వెళ్తారని భావించారు. కానీ పలు సందర్భాల్లో ఆయన ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, కానీ ఎప్పుడు వస్తాననేది త్వరలోనే చెప్తానంటూ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన మాయావతి మాత్రం ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజీనామా తర్వాత ఆయన వ్యూహమేమిటి అనే ఉత్కంఠకు ప్రస్తుతం తెరపడినట్టే.

వచ్చే నెల 8న చేరిక

బీఎస్పీలో ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ వచ్చే నెల 8న చేరుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి, అక్కడ జాతీయ స్థాయి నేతల సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకోనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలోనూ ఆయన యూపీకి వెళ్లి మాయావతిని కలిసి వచ్చారనే ప్రచారం కూడా జరిగింది.

నోరు జారిన బీజేపీ నేత.. ఇరకాటంలో పడ్డ ఈటల



Next Story

Most Viewed