వందలమందిని ముంచి.. అ’సామాన్యుడి’గా ఎదిగిన సుభాని

by  |
Sheikh Mahaboob Subhani
X

దిశ, మక్తల్: ‘షేర్ మార్కెట్లో రూ.లక్ష డిపాజిట్ చేయండి. నెలకు రూ.20వేల వడ్డీ, రెండు తులాల బంగారం.. రూ.4వేల నగదు.. అంటూ ఓ ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. స్థానికంగా పలుకుడి ఉన్నవారు, రాజకీయ నేతలను మచ్చిక చేసుకుని ఈ చీటింగ్‌ చేశాడో వ్యక్తి. వందల మంది నుంచి డిపాజిట్లు సేకరించి సుమారు వందకోట్లతో ఉడాయించాడు. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన షేక్ మహబూబ్ సుభాని ఏడాదిన్నర క్రితం మక్తల్‌‌కు వచ్చి నివాసం ఉంటున్నాడు. షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నానని స్థానికులు, రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభం వస్తుందని అందరినీ నమ్మించాడు. రూ.లక్ష పెట్టిన వారికి రూ.20వేల వడ్డీ నెల రోజుల్లోనే వస్తుందని చెప్పాడు.

అలా పెట్టుబడి పెట్టిన నమ్మకస్తులకు రూ.20వేలు ఇస్తూ వచ్చాడు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించడంతో సుభాని వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. వచ్చిన డబ్బుతో సమీపంలో భూములు కొన్నట్లు పట్టాలను మార్టిగేజ్ చేసి చూపాడు. షేర్ మార్కెట్‌లో వచ్చిన లాభాలతోనే ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేసినట్లు అందరినీ నమ్మించాడు. ఈ క్రమంలో వందల మంది సుభాష్ దగ్గర రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా సుభాని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దుకాణానికి, ఇంటికి వెళ్లిన బాధితులకు గుమ్మాలకు తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. సుభాని వారం క్రితం కూడా రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రెండు తులాల బంగారంతో పాటు రూ.4వేలు ఇస్తానని కొత్తగా ఓ స్కీమ్ ను ప్రారంభించి రూ.లక్షలు దండుకున్నాడు. అధిక వడ్డీకి ఆశపడితే ఉన్న సొమ్ము దోచుకెళ్లాడని లబోదిబోమంటున్నారు.

అ’సామాన్యుడి’గా ఎదిగిన సుభాని

షేర్ మార్కెట్ పేరుతో అందరినీ నమ్మించి రూ.100 కోట్లతో ఉడాయించిన షేక్ మహబూబ్ సుభాని అసామాన్యుడిగా ఎదిగాడు. మక్తల్ కు వచ్చి అందరితోనూ పరిచయాలు పెంచుకున్నాడు. పెట్టుబడి పెట్టిస్తే మంచి కమీషన్ కూడా ఇస్తానని ఆశపెట్టడంతో తన ఖాతాలోకి రూ.లక్షలు వచ్చిచేరాయి. ఆ నోటా.. ఈ నోటా రాజకీయ నాయకులకు చేరడంతో వాళ్లు కూడా సుభాని ఏజెంట్లుగా మారిపోయారు. ఏడాదిన్నర కాలంలోనే వేల మంది నుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్లు పోగేసుకున్నాడు. ప్రారంభంలో అతడు చెప్పిన విధంగానే రూ.లక్షకు రూ.20వేలు చెల్లిస్తూ పోయాడు. అతనిపై నమ్మకం ఏర్పడడంతో అధిక వడ్డీకి ఆశపడిన కొందరు పేరు చెప్పుకోని బడా నాయకులు కూడా సుభాని వద్ద డిపాజిట్ చేశారు. మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, గద్వాల నియోజకవర్గాల్లో ఆయన అక్రమ సామ్రాజ్యం కొనసాగింది. సుభాన్ తో పెట్టుబడి పెట్టినవారిలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన కొందరు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగులే ఏజెంట్లు

షేర్ మార్కెట్ నిర్వహించే సుభాన్ కు ఏజెంట్లుగా ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగస్తులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ కు చెందిన ఓ వ్యక్తి సుభాన్ ను నిలదీసినప్పుడు నమ్మకం కోసం తాను వెంచర్ చేసిన ప్లాట్లను స్టాంప్ పేపర్ పై రాసినట్లు తెలిసింది. అలా రాసిచ్చిన ప్లాట్లు ఇంతకుముందే ఇతరులకు అమ్మినట్టు వారికి తెలియదు. ఇలా మోసపోయినవారు వేలసంఖ్యలో ఉన్నారు. తన నమ్మకస్తులకు కొంతమందికి ఆధార్ కార్డు ఇవ్వగా.. ఫొటో మార్ఫింగ్ చేసినట్టు ఉంది. అందులో ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలోని రామకృష్ణారావు పేట గురుసువారిపేట కాలనీగా ఉంది. కాగా ‘దిశ’లో వచ్చిన వార్తకు మక్తల్ పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కట్టారు. మక్తల్ సర్కిల్ పరిధిలోని మండలాలకు సంబంధించిన బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని, మోసపోయినవారు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయొచ్చని సీఐ శంకర్ కోరారు. బాధితులు ఎంతమంది ఉన్నారన్నది రెండు మూడు రోజులు ఆగితేగానీ తెలియదని చెప్పారు.



Next Story

Most Viewed