ఐటీలో బడా కంపెనీల వేట!

by  |
ఐటీలో బడా కంపెనీల వేట!
X

దిశ, వెబ్‌డెస్క్: బలహీనుడిని బలవంతుడు కబ్జా చేయడమే కార్పొరేట్ సూత్రం. కబ్జా అంటే బలవంతంగా లాక్కోవడమే కాదు బిజినెస్ వ్యూహంలో భాగంగా ఏదో ఒక రూపంలో ఒక కంపెనీని మరో బలమైన కంపెనీ చేజిక్కించుకోవడం కూడా. ప్రపంచాన్ని కొవిడ్-19 కబళిస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాల్లో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. చిన్న కంపెనీలు, ఆర్థికంగా బలంగా లేని కంపెనీలు ఇంకా ఎక్కువ ఆందోళనకు గురవుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. ఎందుకంటే, మూలధన నిల్వలు ఉన్న సంస్థలు నష్టాల్లో ఉన్న సంస్థలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పెద్ద కంపెనీలకు ఇదే సరైన సమయం. తమ వద్ద ఉన్న నగదు నిల్వలతో పనితీరు ఆయా బలహీన కంపెనీలను కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

మన దేశంలో ప్రధానమైన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. ఏళ్లుగా ఈ కంపెనీలు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. అనేక సంక్షోభాల నుంచి నిలదొక్కుకుని పటిష్టంగా కొనసాగుతున్నాయి. మారిన అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల ఈ మూడు కంపెనీల నగదు నిల్వలు భారీగా పెరిగాయి. ఈ మూడు కంపెనీల నగదు నిల్వలు సుమారు రూ. 98 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ బడా కంపెనీలు వీలైనంత వేగంగా వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడే టీసీఎస్ సంస్థ కొనుగోళ్లను ఎక్కువగా నిర్వహించిందని, మార్కెట్లో వేరే ఏ కంపెనీ కొనడానికి సిద్ధంగా లేని సమయంలో ఆ పని ఇంకా సులభమని టీసీఎస్ సీఈవో రాజేష్ అభిప్రాయపడ్డారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో సిటీ బ్యాంకు ఇండియా కేపిటివ్ విభాగాన్ని తమ సంస్థ రూ. 3,800 కోట్లకే కొన్నట్లు చెప్పారు. అదే సంస్థ నుంచి తాము సుమారు రూ. 19,000 కోట్ల కాంట్రాక్టును పొందామని తెలిపారు. గతంలో టీసీఎస్ సంస్థ డబ్ల్యూ 12, బ్రిడ్జి పాయింట్, జనరల్ మోటార్స్‌కు చెందిన ఇండియాలోని టెక్నికల్ సెంటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

పెద్ద కంపెనీల నిల్వలు ఇవీ…

ప్రస్తుతం టీసీఎస్ కంపెనీ అత్యధికంగా రూ. 44.8 వేల కోట్ల నగదు నిల్వలున్నాయి, విప్రో వద్ద రూ. 26.6 వేల కోట్లు, ఇన్ఫోసిస్ వద్ద రూ. 27.3 వేల కోట్ల నగదు నిల్వలున్నాయి. టీసీఎస్ మార్గంలోనే మిగిలిన రెండు దిగ్గజ కంపెనీలు పయనించే అవకాశాలున్నాయి. ఇదే అభిప్రాయానికి విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థకు అందుబాటులో ఉండి, తక్కువ్ ధరకే లభించే కంపెనీలను కొనడానికి ఇదే సమయమని ఆయన స్పష్టం చేశారు. నగదు నిల్వలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియను అమలు చేసే ప్రయత్నాల్లో ఉంటూ, సరైన అవకాశం వస్తే ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇన్ఫోసిస్ సీఈవో సలీ పరేఖ్ అభిప్రాయపడ్డారు. కంపెనీలు భవిష్యత్తులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరి చిన్న కంపెనీలు నష్టాలను భరిస్తూ ఆశలతో కొనసాగిస్తాయా…దివాలా ఎందుకని పెద్ద కంపెనీల చెంతకు చేరుతాయా చూడాలి.

Tags: IT companies, mergers, acquisitions, coronavirus, covid-19, pandamic

Next Story

Most Viewed