హెచ్‌సీఏలో గొడవ.. అజారుద్దీన్ vs విజయానంద్

by  |
హెచ్‌సీఏలో గొడవ.. అజారుద్దీన్ vs విజయానంద్
X

దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మరోసారి అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. హెచ్‌సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించడంపై అధ్యక్షుడు అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ మధ్య వచ్చిన విభేదాలు కాస్తా.. ఇరు వర్గాల ఘర్షణగా మారింది. బీసీసీఐ ఏజీఎం ఈ నెల 24న నిర్వహిస్తుండటంతో.. అంతుకు ముందే ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ఏజీఎంలు నిర్వహించి సదరు మినిట్స్‌ను బోర్డుకు పంపాల్సి ఉన్నది. దీంతో గత నెల 29న ఏజీఎం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా డిసెంబర్ 20 ఏజీఎం నిర్వహించేందుకు అసోసియేషన్ సిద్దపడింది. ఉప్పల్ స్టేడియంలో 250 మందితో ఏజీఎం నిర్వహించడానికి అనుమతి కావాలని కార్యదర్శి విజయానంద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు లేఖ రాశారు. విషయం తెలుసుకున్న అధ్యక్షుడు అజారుద్దీన్ ఏజీఎంకు అనుమతి ఇవ్వొద్దని కోరతూ మరో లేఖ రాశారు. దీంతో అసోసియేషన్‌లో ఒక్క సారిగా విభేదాలు భగ్గుమన్నాయి.

పదవి పోతుందనే భయంతోనే..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడిన నాటి నుంచి అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ఇతర సభ్యులతో పొసగడం లేదు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్ నియాకంలో అజార్ ఏకపక్షంగా వ్యవహరించారని అప్పట్లోనే ఆయనపై అసమ్మతి చెలరేగింది. అది కాస్త చల్లబడిందనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఏజీఎంపై రచ్చ మొదలైంది. ఏజీఎం జరిగితే అజారుద్దీన్ పదవి పోతుందనే భయంతోనే అడ్డుకుంటున్నాడని కార్యదర్శి విజయానంద్ అంటున్నారు. అంతే కాకుండా హెచ్‌సీఏ పరిధిలో క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభించడానికి కూడా అజార్ అడ్డుపడుతున్నాడని విజయానంద్ ఆరోపిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మ్యాచ్‌లు నిర్వహిస్తామంటే అధ్యక్షుడే అడ్డుకోవడం ఏంటని సభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. అజార్ అడ్డుకుంటున్నందు వల్లే ఏజీఎంలో మ్యాచ్‌ల నిర్వహణకు తీర్మానం చేయాలని భావించామని.. ఆ తీర్మానం పాస్ అయితే వ్యతిరేకించిన అజార్ పదవి పోవడం ఖాయం.. అందుకే ఏకంగా ఏజీఎం నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని లేఖ రాశారని ప్రత్యర్థి వర్గం అంటోంది.

కలిసి ఇస్తేనే..

హెచ్‌సీఏ ఏజీఎం నిర్వహణకు అధ్యక్ష, కార్యదర్శులు కలసి లేఖ రాస్తేనే అనుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఏజీఎం నిర్వహించకుంటే బోర్డు నుంచి రావల్సిన నిధులు కూడా ఆగిపోతాయి. అంతేకాకుండా కంపెనీ రిజిస్ట్రార్ నుంచి అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు లభించడం కష్టం. అసోసియేషన్‌లో సభ్యులందరూ ఒక్కతాటిపై ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కీలకమైన ఈ సమయంలో అధ్యక్ష కార్యదర్శుల మధ్య విభేదాలు క్రికెటర్ల కెరీర్‌లను ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ దిగి వస్తేనే కానీ ఈ విభేదాలకు తెరపడదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story

Most Viewed