జగన్ సర్కార్‌కు అశోక్ గజపతిరాజు హితవు

by  |
Ashok Gajapatiraju
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంపై మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో చట్టాలు ఉన్నాయని… రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా తొలగిస్తూ ప్రత్యేక జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. తన హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలతో తనను తొలగించారని చెప్పుకొచ్చారు.

తన హయాంలో అవినీతి జరగడం అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు. అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారే తప్ప ఎక్కడ జరిగిందో నిరూపించలేకపోయారని అశోక్‌గజపతి రాజు స్పష్టం చేశారు. తాను రామతీర్ధాలు దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపించారని గుర్తు చేశారు. తనపై చేసిన ఆరోపణలు గానీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు.

ఇకపోతే ట్రస్ట్, దేవస్థానాల్లో ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. సింహచలం దేవస్థానం గోశాలలో గోవుల ప్రాణాలు విడిచాయన్నారు. వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపేశారని ఆరోపించారు. వాటి ప్రాణాలు ఎవరు తెస్తారని ప్రశ్నించారు. 105 దేవాలయాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. మాన్సాస్ ట్రస్ట్, దేవస్థానాల్లో ఇప్పటి వరకు ఏం జరిగిందో అనేది తెలుసుకుని వాటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం ఏమేరకు సహకరిస్తుందో వేచి చూడాలని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

జగన్ సర్కార్‌కి చెంపపెట్టు : నారా లోకేశ్

మాన్సాస్ ట్ర‌స్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయానిదే అంతిమ విజ‌యం అని చెప్పుకొచ్చారు. ఈ తీర్పు అప్ర‌జాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధ‌రాత్రి చీక‌టి జీవోలు జారీచేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకి చెంప‌పెట్టులాంటిదన్నారు.

భూములు, వేల కోట్ల ఆస్తులు ప్ర‌జ‌లకు దాన‌మిచ్చిన పూస‌పాటి వంశీకుల దాన‌గుణానికి, స‌త్య‌నిష్ట‌కి న్యాయ‌స్థానం తీర్పు మ‌రింత వ‌న్నెతెచ్చిందని అభిప్రాయపడ్డారు. అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌పై సింహాచ‌లం అప్ప‌న్న ఆశీస్సులు, ప్ర‌జాభిమానం, చ‌ట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజ‌యం ఇది అని కొనియాడారు. న్యాయ‌పోరాటం సాధించిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed