ఆర్డినెన్స్ తెచ్చారు.. ఎన్నికల కమిషనర్‌ని తీసేశా

by  |
ఆర్డినెన్స్ తెచ్చారు.. ఎన్నికల కమిషనర్‌ని తీసేశా
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఊహించని మలుపులతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. కరోనా సమస్య రాష్ట్రాన్ని పీడిస్తున్న వేళ… ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలానికి సంబంధించిన మార్పులతో కూడిన ఆర్డినెన్స్‌ను సీఎం జగన్ ప్రభుత్వం అకస్మాత్తుగా వెలికి తీసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది.

ఏపీలో గత నెల 21, 23, 27, 29 తేదీల్లో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ సంస్థల ఎన్నికలను ‘కరోనా’కారణంగా తన విచక్షణాధికారాలు ఉపయోగించి, వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అధికార ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. ఎస్‌ఈసీని కుల పక్షపాతిగా సాక్షాత్తూ సీఎం విమర్శించారు. ఒక వర్గానికి కొమ్ముకాసేందుకు, పదవి ఇచ్చిన వారి రుణం తీర్చుకునేందుకే ఎన్నికల వాయిదా అంటూ వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

మరోవైపు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల నగదును తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చింది. దీనిని వైఎస్సార్సీపీ నేతలు పంచడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసి, ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నారన్న ఊహాగానాల నడుమ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్ 1994ను సవరించేందుకు నడుంబిగించింది. ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే దానిని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దగ్గరకు పంపింది. ఆయన ఆమోద ముద్రవేయగానే ఆర్డినెన్స్ కార్యరూపం దాల్చింది. వెంటనే ఎస్ఈసీని తొలగించినట్టు కధనాలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం విశేషం. ఆయన స్థానంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఎవరినైనా నియమించే అవకాశం కనిపిస్తోంది.

ఆర్డినెన్స్ వివరాల్లోకి వెళ్తే…

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎస్ఈసీ పదవీ కాలం, అర్హత, నియామక పద్ధతికి సంబంధించిన ఏపీ పంచాయతీ రాజ్ యాక్టు-1994 ను ప్రభుత్వం సవరించింది. స్వతంత్ర, న్యాయమైన, తటస్థ వ్యక్తి ఈ పదవిలో ఉండేలా ప్రతిపాదిత ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం హైకోర్టులో జడ్జిగా పని చేసిన వ్యక్తి మాత్రమే ఎస్ఈసీగా నియామకానికి అర్హులుగా ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాకు తక్కువకాని పదవిలో పనిచేసిన వారిని మాత్రమే ఎస్ఈసీ గా నియమిస్తున్నారు. అందువల్ల, బ్యూరోక్రాట్స్ మాత్రమే ఈ పదవికి అర్హులుగా ఉన్నారు.

ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవీకాలాన్ని కూడా ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించినట్టు తెలుస్తోంది. ఇకపై ఎస్ఈసీ పదవిలో కొనసాగే ఎవరైనా మూడేళ్లు పదవిలో ఉంటే మరో మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే చేపట్టిన పదవీ కాలంతో పాటు పొడిగించిన పదవీ కాలం కలిపి ఆరేళ్లకు మించకూడదు. ఎస్ఈసీ జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ హైకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటుంది.

Tags: sec, state election commissioner, ordnance, ysrcp, ys jagan



Next Story