తెలంగాణకు పెరిగిన రెమిడెసివిర్ కోటా

by  |
Remdesivir injections
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ కోటాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఐదున్నర వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నామని, దాన్ని 10,500కు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ఫోన్ చేసి కేసీఆర్‌కు తెలియజేసినట్లు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్సిజన్, వ్యాక్సిన్ కోటాను కూడా పెంచడానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు అందుతున్న ఆక్సిజన్ కోటాకు అదనంగా 200 టన్నులను సమకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి, ఒరిస్సాలోని అంగుల్ నుంచి, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో అధికారుల ద్వారా సమన్వయం చేసుకోవాల్సిందిగా కేసీఆర్‌కు కేంద్ర మంత్రి సూచించారని తెలిపింది. వ్యాక్సిన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది. డబుల్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కేంద్రమంత్రి కూడా సూచించినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేసీఆర్ వివరించారని పేర్కొంది.

అందరికీ కరోనా వైద్యం అందించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టానికి తలకుమించిన భారంగా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణకోసం ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, కరోనా వాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని ప్రధాని మోడీ స్వయంగా తనకు ఆదేశాలు జారీచేసినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఈ సందర్భంగా సీఎం కీసీఆర్‌కు వివరించారు.

Next Story

Most Viewed