ఓటీఎస్ పథకం ద్వారా చేసే రిజిస్ట్రేషన్లు చెల్లవు: జనసేన నేత కీలక వ్యాఖ్యలు

by  |
satyanarayana
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలు ఓటీఎస్(వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ) చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా అది సాధ్యమవుతుంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పేదవాడి సొంతింటికల నెరవేర్చేందుకు ఈ ఓటీఎస్ పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. తనఖా పెట్టిన ఇంటి స్థలాలను ప్రైవేటు ఆస్తులుగా మారుస్తూ.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించింది. ఈ ఓటీఎస్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించారు. అయితే ఈ ఓటీఎస్ పథకంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు, జనసేన సైతం మండిపడుతున్నాయి. పేదలను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆరోపిస్తోంది. మరో 10వేల కోట్ల రూపాయలు దోపిడీకి ప్రభుత్వం స్కెచ్ వేసిందని అందులో భాగమే ఈ ఓటీఎస్ పథకమని టీడీపీ ఆరోపిస్తోంది. ఎవరూ కూడా ఓటీఎస్ పథకానికి సంబంధించి డబ్బులు చెల్లించవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని భరోసా ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఓటీఎస్ పథకం ద్వారా చేసే రిజిస్ట్రేషన్ చెల్లదంటూ జనసేన పార్టీ చెప్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు.‘22aలో ఉన్న నిషేధిత భూమిని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చెయ్యలేరు అందుకే సచివాలయంలో వైసీపీ చేస్తే అది చట్ట ఉల్లంఘనే.. ఆ మాత్రం జ్ఞానం లేని సలహాదారులను ఎందుకు పెట్టుకున్నారని ప్రభుత్వాన్ని బొలిశెట్టి సత్యనారాయణ నిలదీశారు. ఓటీఎస్ చెల్లించిన ఇంటికి రిజిస్ట్రేషన్ జరిగితే అది చట్ట ఉల్లంఘనే అవుతుందని బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్నారు. 22aలో ఉన్న నిషేధిత భూమిని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చెయ్యలేరు అన్న వాదనపై వైసీపీ ప్రభుత్వం ఎలా సమాధానమిస్తుందో వేచి చూడాలి.

Next Story